News


ఆర్థికాంశాలు, ఫలితాలే దిక్సూచీ..!

Monday 11th November 2019
Markets_main1573441151.png-29482

  • సోమవారం పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ ఉత్పత్తి వెల్లడి
  • మంగళవారం సీపీఐ ద్రవ్యోల్బణం, గురువారం డబ్ల్యూపీఐ గణాంకాలు
  • కోల్ ఇండియా, హిందాల్కో, బ్రిటానియా, అరబిందో ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, కాడిలా హెల్త్‌కేర్, ఆయిల్ ఇండియా, నాల్కో ఫలితాలు ఈవారంలోనే..
  • గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం సెలవు

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఈవారంలో వెల్లడికానున్న పలు కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లో సానుకూలతను నింపేందుకు ఆస్కారం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి నుంచి ఇప్పటివరకు 4 శాతం, సెప్టెంబర్‌ 20 నుంచి 13 శాతం ర్యాలీ చేసిన ప్రధాన సూచీలు.. ఇదే జోరును కొనసాగించవచ్చని విశ్లేషిస్తున్నాయి. ‘లార్జ్‌, బ్లూ-చిప్‌ షేర్ల వాల్యుయేషన్స్‌ మళ్లీ ప్రీమియం స్థాయికి చేరుకున్నాయి. ఇది మార్కెట్‌ ట్రెండ్‌పై ప్రభావం చూపేందుకు ఆస్కారం ఉంది. అయితే, దీర్ఘకాలిక లాభాల కోసం మార్కెట్‌ అవుట్‌లుక్‌ మెరుగుపడిందనే చెప్పాలి. ప్రభుత్వ సంస్కరణలు, ఉద్దీపనలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల, వర్షాలు ఆశాజనకంగా ఉండడం, వడ్డీ రేట్లు తగ్గించడం వంటి సానుకూల అంశాల ప్రభావాన్ని ప్రస్తుత కంపెనీల ఫలితాల వెల్లడి సీజన్‌ అద్ధం పడుతోంది. ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో ఎర్నింగ్స్‌ వృద్ధి బాగుండవచ్చనే సంకేతాలు ఇస్తుంది’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. ఈ వారంలో వెల్లడికానున్న స్థూల ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రెండ్‌ ఉండనుందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు. 

అయోధ్యపై సుప్రీం తీర్పు ప్రభావం...
వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాల భూమిపై సుప్రీం కోర్టు శనివారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. రామజన్మభూమి న్యాస్‌కే ఈ భూమి చెందుతుందని, రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని సూచించింది. రెండున్నర దశాబ్ధాల వివాదాస్పదానికి తెరపడిన నేపథ్యంలో ఈ అంశంపై మార్కెట్‌ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కేఆర్‌ చోక్సి ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఎండీ దివాన్‌ చోక్సి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తుందని, వివాదం ముగియడంతో ఈ రాష్ట్ర వాటా మెరుగుపడే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా విశ్లేషించారు. అయితే, తీర్పు ప్రభావం మార్కెట్‌పై పెద్దగా ఉండకపోవచ్చని తాను భావిస్తున్నట్లు ట్రేడింగ్‌ బెల్స్‌ సీనియర్ విశ్లేషకులు సంతోష్ మీనా అన్నారు.

స్థూల ఆర్థికాంశాలు...
సెప్టెంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, తయారీ రంగ ఉత్పత్తి డేటా నవంబర్‌ 11న (సోమవారం) వెల్లడికానున్నాయి. ఇక మంగళవారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం, గురువారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రానున్నాయి. గణనీయంగా పెరిగిన కూరగాయల ధరలను ఆధారంగా చేసుకుని చూస్తే.. సీపీఐ 4.3 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నట్లు వినోద్‌ నాయర్‌ అంచనావేశారు.

2,700 కంపెనీల ఫలితాలు...
ఈవారంలో 2,700 కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండగా.. లార్జ్‌క్యాప్స్‌ జాబితాలో కోల్ ఇండియా, హిందాల్కో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అరబిందో ఫార్మా, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మదర్సన్ సుమి సిస్టమ్స్, ఆయిల్ ఇండియా, కాడిలా హెల్త్‌కేర్, ఏబీబీ ఇండియా, నాల్కో కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు మహానగర్ గ్యాస్, సింఫనీ, ఐఆర్‌సీటీసీ, థర్మాక్స్, బ్లూ స్టార్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, బాటా ఇండియా, వోడాఫోన్ ఐడియా, గ్లెన్‌మార్క్ ఫార్మా, డిష్ టీవీ, పేజ్ ఇండస్ట్రీస్, దిలీప్ బిల్డ్‌కాన్ వంటి ఇతర కంపెనీల ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే...
గురునానక్ 550వ జయంతి సందర్భంగా మంగళవారం (నవంబర్‌ 12న) దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. బుధవారం (13న) ఉదయం మార్కెట్‌ యథావిధిగా ప్రారంభంకానుంది.

నవంబర్‌లో రూ. 12,000 కోట్ల పెట్టుబడి
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ. 12,000 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. నవంబర్‌ 1-9 కాలంలో వీరు స్టాక్‌ మార్కెట్లో రూ. 6,434 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ. 5,673 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. You may be interested

సెన్సెక్స్‌ తక్షణ మద్దతుశ్రేణి 40,050–39,920

Monday 11th November 2019

అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అమెరికా, బ్రెజిల్‌ సూచీలు కొత్త రికార్డుల్ని అందుకోగా, పలు యూరప్, ఆసియా సూచీలు నెలల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటికే కొత్త రికార్డు స్థాయిని చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రికార్డు గరిష్టస్థాయికి మరో 0.7 శాతం దూరంలో వుండగా, ఇండియా రేటింగ్‌ను మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం, అమెరికా–చైనాల ట్రేడ్‌ డీల్‌పై అనుమానాలు తలెత్తడంతో మార్కెట్‌ వెనక్కు

మార్కెట్ల గమనం ఎటు..?

Monday 11th November 2019

స్టాక్‌ మార్కెట్ల బుల్‌ ర్యాలీలో పాల్గొనకుండా వేచి చూసేందుకు ఇన్వెస్టర్లు ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇన్వెస్టర్ల క్రమంగా కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్టు మార్కెట్‌ వ్యాప్తంగా పెరుగుదల తెలియజేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లలో ర్యాలీయే నడుస్తోంది. కాకపోతే నూతన గరిష్టాల వద్ద మార్కెట్లు తడబడుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినా లేక ఆర్థిక సంస్కరణల్లో ఏవైనా కేంద్రం అమ్ముల పొది నుంచి తీసినా చాలా పెద్ద సానుకూలమే అవుతుందని అనలిస్టుల విశ్లేషణ. కానీ,

Most from this category