News


రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెద్ద ఉపశమనం

Friday 10th January 2020
Markets_main1578595127.png-30808

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీకి పెద్ద ఉపశమనం లభించింది. ఢిల్లీ-ఆగ్రా టోల్‌ రోడ్డు ప్రాజెక్టును సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు విక్రయించేందుకు ఈ కంపెనీ గతంలోనే అవగాహనకు రాగా.. ఎట్టకేలకు దీనికి నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించింది. ‘సామరస్య పూర్వక ప్రత్యామ్నాయం’ కింద ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టు నిర్వహణదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, నిబంధనలకు లోబడి ప్రత్యామ్నాయం కింద ఆ ప్రాజెక్టుల నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించాలని గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు తాజా ఆమోదం లభించింది. 

 
ఢిల్లీ-ఆగ్రా టోల్‌ రోడ్డు ‍ప్రాజెక్టుకు ఎంటర్‌ప్రైజ్‌ వ్యాల్యూ రూ.3,600 కోట్లు కాగా, ఇందులో ఈక్విటీ కింద రూ.1,700 కోట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు దక్కనున్నాయి. మరో రూ.1,900 కోట్ల ప్రాజెక్టు రుణాన్ని క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌-3 పీటీఈ లిమిటెడ్‌కు బదిలీ చేయడం జరుగుతుంది. విక్రయం ద్వారా వచ్చే రూ.1,700 కోట్లను పూర్తిగా రుణం తీర్చేందుకే వినియోగించనున్నట్టు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా సీఈవో పునీత్‌ గార్గ్‌ స్పష్టం చేశారు. డిసెంబర్‌ చివరికి ఆర్‌ఇన్‌ఫ్రా రుణ భారం రూ.6,000 కోట్లుగా ఉంది. ఢిల్లీ-ఆగ్రా టోల్‌ రోడ్డు విక్రయం రూపంలో వచ్చే రూ.1,700 కోట్లను రుణ చెల్లింపులకు వినియోగిస్తే.. అప్పుడు రుణ భారం రూ.4,300 కోట్లకు పరిమితం అవుతుంది. 

 

గతేడాది జూలై 6న రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 16 మంది రుణదాతలతో ఇంటర్‌ క్రెడిటార్‌ అగ్రిమెంట్‌ (ఐసీఏ) చేసుకుంది. దీనికి ఆరు నెలల గడువు ఉంది. అప్పటి వరకు అసలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం లభించింది. ఈ ఒప్పందానికి లోబడే ఈ విక్రయం ఉన్నట్టు కంపెనీ పత్రికా ప్రకటనలో తెలిపింది. ‘‘2020లో రుణ రహిత కంపెనీగా మారే దిశగా జరిగే ఎన్నో అమ్మకాల్లో ఇది మొదటిది. మా పట్ల, మా వ్యాపారం, యాజమాన్య బృందం పట్ల విశ్వాసం ఉంచినందుకు రుణదాతలకు ధన్యవాదములు’’ అని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఢిల్లీ-ఆగ్రా టోల్‌ రోడ్డు 180 కిలోమీటర్ల నిడివితో ఉంటుంది. You may be interested

శామ్‌సంగ్‌ నుంచి అత్యాధునిక ఏసీలు

Friday 10th January 2020

దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సింగ్‌ ఎలక్ట్రానిక్స్‌ గురువారం భారత మార్కెట్లో 40 సిర్‌ కండీషనింగ్‌ ఏసీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో వైండ్‌ఫ్రీ ఏసీ 2.0 కూడా ఉంది. గదిలో గంటకు పైగా వ్యక్తులు ఎవరూ లేకపోతే సెన్సార్‌ గుర్తించి విద్యుత్‌ పొదుపు మోడ్‌లోకి ఏసీని మార్చేస్తుంది. ఈ ఏసీల్లోని ప్రత్యేకతల్లో ఇదీ ఒకటి. అలాగే, ప్రీమియం ట్రిపుల్‌ ఇన్వర్టర్‌ సిరీస్‌ ఏసీలు, ఎకో ఇన్వర్టర్‌, ఆన్‌/ఆఫ్‌ ఏసీలు, విండో

అటో షేర్ల పరుగులు

Thursday 9th January 2020

మార్కెట్లో గురువారం జరిగిన బుల్‌ రన్‌లో అటో షేర్లు లాభాల పరుగులు పెట్టాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే అటో ఇండెక్స్‌ 2.68శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(7,942.75)తో పోలిస్తే 93 పాయింట్లు లాభంతో 8,035.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అటో షేర్లకు గిరాకి నెలకొనడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2.80శాతం లాభంతో 8165.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Most from this category