News


చమురు ధరలకూ కరోనా కాటు

Thursday 12th March 2020
Markets_main1583988047.png-32422

ప్రస్తుతం 5 శాతం పతనం
యూరప్‌ దేశాల ప్రయాణాలపై అమెరికా నిషేధం
కరోనాను ప్రపంచ మహమ్మారిగా పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో
ఉత్పత్తి, విక్రయాలను పెంచనున్న యూఏఈ

రెండు రోజుల మహా పతనం నుంచి కోలుకున్న ఒక్క రోజులోనే తిరిగి ముడిచమురు ధరలకు షాక్‌ తగిలింది. చైనాలో పుట్టి మొత్తం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇందుకు కారణంకావడం గమనార్హం. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 5 శాతం(1.8 డాలర్లు) దిగజారి 34 డాలర్ల దిగువకు చేరింది. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 4.9 శాతం(1.62 డాలర్లు) పడిపోయి 31.36 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మంగళవారం 8 శాతం రికవర్‌ అయిన చమురు ధరలు బుధవారం సైతం చమురు ధరలు 4 శాతం క్షీణించాయి. కాగా.. ఈ ఏడాది జనవరిలో నమోదైన గరిష్టం నుంచి చమురు ధరలు 50 శాతం పడిపోవడం గమనార్హం!

ఏం జరిగిందంటే?
కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారి వ్యాధిగా గుర్తిస్తున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య సం‍స్థ(డబ్ల్యూహెచ్‌వో) తొలిసారి ప్రకటించింది. దీనికితోడు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ యూరోపియన్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై తాజాగా నిషేధాన్ని విధించారు. యూరోపియన్‌ దేశాలలో ఈ వ్యాధి విస్తృతంకావడం కారణంగానే అమెరికాను సైతం వైరస్‌ ఆవహిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్‌ ఆరోపించారు. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవచ్చన్న ఆందోళనలు అంతటా చెలరేగినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇది చమురు వినియోగాన్ని దెబ్బతీసే వీలున్నట్లు తెలియజేశారు. ఫలితంగా చమురు ధరలు మరోసారి నీరసించినట్లు వివరించారు. ఒపెక్‌లో భాగమైన యూఏఈ తాజాగా చమురు ఉత్పత్తిని రోజుకి 6 మిలియన్‌ బ్యారళ్లకు పెంచడంతోపాటు.. 4 మిలియన్‌ బ్యారళ్ల విక్రయాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇది కూడా సెంటిమెంటును బలహీనపరచినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.

సౌదీ దెబ్బ
గత వారం ఉత్పత్తిలో మరిన్ని కోతలకు రష్యా అంగీకరించకపోవడంతో సౌదీ అరేబియా డిస్కౌంట్‌ ధరలలో చమురు విక్రయాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఏప్రిల్‌కల్లా రికార్డ్‌స్థాయిలో చమురును ఉత్పత్తి చేయనున్నట్లు తెలియజేసింది. చమురు ధరలకు నిలకడను తీసుకువచ్చే బాటలో సౌదీ అధ్యక్షతన ఒపెక్‌ దేశాలతోపాటు.. రష్యా సైతం రెండేళ్లుగా ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమలు చేస్తున్న రోజుకి 2.5 మిలియన్‌ బ్యారళ్ల కోతలకు జతగా మరో 1.5 మిలియన్‌ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు సౌదీ అరేబియా గత వారం ప్రతిపాదించింది. దీనిలో 0.5 బ్యారళ్ల ఉత్పత్తిని రష్యా తగ్గించుకోవలసి ఉంటుంది. అయితే ఇందుకు రష్యా అంగీకరించకపోవడంతో సౌదీ ఒక్కో బ్యారల్‌ చమురు సరఫరాలపై 6-8 డాలర్ల డిస్కౌంట్‌ను ప్రకటించింది. వెరసి రెండు రోజుల్లో చమురు ధరలు 35 శాతం కుప్పకూలాయి.



You may be interested

భారత్‌లో తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌

Thursday 12th March 2020

రూపొందించిన సెలెస్ట్రియల్‌   హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ను హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సెలెస్ట్రియల్‌ ఈ-మొబిలిటీ రూపొందించింది. వినియోగానికి వీలున్న నమూనాను బుధవారమిక్కడ ఆవిష్కరించింది. ఉద్యానవనాలకు, విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగుల్లో సరుకు రవాణాకు వీలుగా 6 హెచ్‌పీ సామర్థ్యంతో తయారు చేశారు. 21 హెచ్‌పీ డీజిల్‌ ట్రాక్టరుకు సమానంగా ఇది పనిచేస్తుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు సిద్దార్థ దురైరాజన్‌ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ధర రూ.5

యూరప్‌ దేశాలకు నో ఎంట్రీ..ట్రంప్‌!

Thursday 12th March 2020

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ యూరప్‌ దేశాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణీకులపై నిషేధం విధించారు. చైనాలో పుట్టిన కోవిడ్‌-19(కరోనా వైరస్‌) చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తుండడం, అమెరికాలో వేగంగా విస్తరిస్తుండండంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం రాత్రి అమెరికా దేశ ప్రజలనుద్దేశించి టీవీలో మాట్లాడిన సందర్భంగా డోనాల్డ్‌ ట్రంప్‌  వెల్లడించారు. మరో నెలరోజులవరకు(30 రోజులు) యూరప్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అమెరికాలోకి

Most from this category