News


పన్ను కోత ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలి

Friday 27th September 2019
Markets_main1569558917.png-28583

  • ఉత్పత్తుల ధరలను తగ్గించాలి
  • దాంతో అమ్మకాలు పెరుగుతాయి
  • ఆర్థిక గణాంకాలు అనుకూలంగా ఉన్నాయి
  • హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌పరేఖ్‌ 

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇటీవలే తగ్గించిన కార్పొరేట్‌ పన్ను ప్రయోజనాన్ని లాభాల్లో ఉన్న కంపెనీలు తమ ఉత్పత్తుల రేట్లను తగ్గించడం ద్వారా కస్టమర్లకు బదలాయించాలని ప్రముఖ బ్యాంకర్‌, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ సూచించారు. తద్వారా కంపెనీల ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును తగ్గించడం అన్నది దేశ వృద్ధికి తోడ్పడుతుందని అభిప్రాయం వ్యకర్తం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ద్రవ్యలోటుపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. ఎయిర్‌ ఇండియా సహా పలు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే నిధులతో లోటును పూడ్చుకోవచ్చన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు దీపక్‌ పరేఖ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘మన పన్ను రేట్లు చాలా పోటీనిచ్చే స్థాయికి చేరాయి. కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... వియత్నాం, కంబోడియా, థాయిలాండ్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌కు వెళ్లిపోతున్న తయారీ యూనిట్లను భారత్‌కు రప్పించేందుకు సాయపడుతుంది. టెక్స్‌టైల్స్‌ రంగంలోని యూనిట్లు ప్రస్తుతం ఈ దేశాలకు తరలిపోతున్నాయి. తక్కువ పన్ను రేటుతో తాజా పెట్టుబడులు ఇప్పుడిక భారత్‌కు తరలివస్తాయి’’ అని దీపక్‌ పరేఖ్‌ వివరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని విదేశీ ఇన్వెస్టర్లు కూడా చక్కగా స్వీకరించారని పేర్కొన్నారు. కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, అక్టోబర్‌ 1 నుంచి 2023 మార్చి వరకు ఉత్పత్తిని ప్రారంభించే నూతన కంపెనీలకు కార్పొరేట్‌ పన్నును 15 శాతానికి తగ్గించింది. అయితే, ఈ నిర్ణయాలు ద్రవ్యలోటు లక్ష్యానికి విఘాతం కలిగిస్తాయన్న అభిప్రాయం కొంత మంది నిపుణులు నుంచి వ్యక్తం కావడం గమనార్హం. 
పోటీ పడాలంటే తగ్గించాలి...
‘‘లాభదాయక కంపెనీలు తగ్గిన పన్ను భారంలో కొంత వరకు ఉత్పత్తుల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు బదలాయించాలి. కంపెనీలు కొంత మేర తమ మార్జిన్లను తగ్గించుకుంటే అమ్మకాలు పెరుగుతాయి. ఓ కంపెనీ మార్కెట్లో పోటీపడాలంటే, తన ఉత్పత్తులను అధికంగా విక్రయించుకోవాలంటే, పన్ను తగ్గింపును కస్టమర్లకు బదలాయించాలి’’ అని దీపక్‌ పరేఖ్‌ సూచించారు. హోటళ్లలోని విడిది చార్జీలపై జీఎస్‌టీ రేటు తగ్గించడం కూడా ఆయా రంగాలకు మేలు చేస్తుందన్నారు. పన్నును తగ్గించడం కంపెనీలకు సానుకూలమని, ప్రభుత్వానికి మాత్రం పరపతి పరంగా ప్రతికూలమని మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఇబ్బందులను కలిగిస్తుందని పేర్కొంది. 
పెట్టుబడుల ఉపసంహరణతో లోటు గట్టెక్కొచ్చు..
ద్రవ్యలోటు పెరుగుతుందన్న ప్రశ్నకు పరేఖ్‌ స్పందిస్తూ... 7-8 ప్రభుత్వరంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు గుర్తు చేశారు. ఎయిర్‌ ఇండియా విక్రయం విజయం సాధించేందుకు గాను రుణ భారాన్ని ప్రభుత్వం ప్రత్యేక కంపెనీకి బదలాయించినట్టు తెలిపారు. ఈ విడత తప్పకుండా ఎయిర్‌ ఇండియా అమ్మకం పూర్తవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అన్ని కంపెనీల విక్రయం 2019-20లో సాధ్యపడకపోయినా, మరో ఆరు నెలల కాలంలో కనీసం 3-4 కంపెనీల్లో వాటాలను విక్రయించడం సాధ్యపడుతుందన్నారు. తద్వారా కావాల్సినన్ని నిధులు ప్రభుత్వానికి సమకూరతాయన్నారు. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించడం కష్టమేనన్న అభిప్రాయాన్ని పరేఖ్‌ వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రభుత్వం తాజాగా అధికాదాయ వర్గాలకు సర్‌చార్జీ పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. 
డిమాండ్‌ ఊపందుకుంటుంది...
సూక్ష్మ ఆర్థిక గణాంకాలు బలంగానే ఉన్నాయని, దేశంలో డిమాండ్‌ త్వరలోనే పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని పరేఖ్‌ వ్యక్తం చేశారు. ‘‘ద్రవ్యలోటు కనిష్ట స్థాయిలో ఉంది. వడ్డీ రేట్లు చారిత్రకంగా కనిష్ట స్థాయికి చేరాయి. ఇంకా తగ్గుతున్నాయి. డాలర్‌తో రూపాయి స్థిరంగానే ఉంది. విదేశీ మారక నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలో 430 బిలియన్‌ డాలర్లకు పైగా ఉన్నాయి. ఇవి కనీసం 11 నెలల దిగుమతులకు సరిపోతాయి’’ అంటూ సానుకూలతలను పరేఖ్‌ వివరించారు. విదేశీ మారక నిల్వల పరంగా ఈ స్థాయి సానుకూలత ఇంతకుముందు ఎప్పుడూ లేదన్నారు. ‘‘సౌదీ అరేబియాపై దాడుల తర్వాత చమురు ధరలు ఒక్కసారిగా 15 శాతం పెరిగినా కానీ, అవి తిరిగి బ్యారెల్‌కు 60-65 డాలర్లకు దిగొచ్చాయి. ప్రధాని అమెరికా పర్యటన ద్వారా విన్నదేమంటే చమురు విషయంలో అమెరికా అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది. అవసరమైతే మరింత సరఫరాకు అమెరికా ఇంధన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అంటే చమురు దిగుమతుల పరంగా మంచి రక్షణ మనకు ఉంది. కొంత మంది నిపుణులు చమురు ధరలు మరో 20 డాలర్ల వరకు తగ్గుతాయంటున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం వస్తే తప్ప చమురు ధరలు పెరిగేందుకు అవకాశాలు తక్కువ’’ అని పరేఖ్‌ అన్నారు. You may be interested

61 డాలర్ల స్థాయికి క్రూడ్‌

Friday 27th September 2019

    చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగిన తర్వాత నుంచి రెండు వారాల్లోనే సౌదీ తన చమురు ఉత్పత్తిని పునరుద్ధరించడంతో చమురు ధరలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.37 సమయానికి బ్రెంట్‌క్రూడ్‌ 1 శాతం నష్టపోయి బారెల్‌ 61.12 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.60 శాతం నష్టపోయి బారెల్‌ 56.07 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘ఊహించని దాని కంటే ముందుగానే సౌదీ తన చమురు కేంద్రాలను

ఒడిదుడుకుల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 27th September 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో  మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.49 సమయానికి నిఫ్టీ 50 10.75 పాయింట్లు కోల్పోయి 11,560.45 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 18.92 పాయింట్లు లాభపడి 39,008.66 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లలో ఒత్తిడి వలన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం 9.49 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌  59.95 పాయింట్లు నష్టపోయి 30029.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో

Most from this category