News


ఇక చిన్న మదుపరికీ బాండ్లు!

Thursday 5th December 2019
Markets_main1575518210.png-30064

  • భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు కేంద్రం ఓకే
  • దీన్లో అన్నీ ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లే
  • మూడేళ్లు, ఏడేళ్ల కాలపరిమితితో త్వరలో ఆరంభం
  • కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి మొదలు
  • రిస్కు లేకుండా స్థిరమైన రాబడి వచ్చే అవకాశం
  • ఇక ప్రభుత్వ రంగ సంస్థల నిధుల సేకరణా ఈజీనే

న్యూఢిల్లీ: ఈక్విటీల మాదిరే కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లోనూ రిటైల్‌ ఇన్వెస్టర్లు చురుగ్గా ఇన్వెస్ట్‌ చేసే అవకాశం రానుంది. ఇందుకు వీలుగా దేశంలోనే తొలి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ (భారత్‌ బాండ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ప్రారంభానికి బుధవారం ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ఈటీఎఫ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదనపు నిధుల సమీకరణ సులభం కానుంది. బడ్జెట్లో పేర్కొన్నట్టుగా బాండ్‌ మార్కెట్‌ను ఇది మరింత విస్తృతం చేస్తుందని కేబినెట్‌ భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ‘‘భద్రత, లిక్విడిటీ, పన్ను లేని స్థిరమైన రాబడులను బాండ్‌ ఈటీఎఫ్‌ అందిస్తుంది’’ అని మంత్రి వివరించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం రూ.1,000 నుంచి బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. బాండ్లకు డిమాండ్‌ పెరిగితే, అప్పుడు తక్కువ ఖర్చుకే నిధులను సమీకరించుకునే అవకాశం ప్రభుత్వరంగ సంస్థలకుంటుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల రుణ అవసరాలకు అనుగుణంగా ఏటా బాండ్‌ కేలండర్‌ను రూపొందిస్తామన్నారు. కాగా, ఈ నెల్లోనే భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఈ సందర్భంగా తెలియజేశారు.
బాండ్‌ ఈటీఎఫ్‌ విశేషాలు..

  • భారత్‌- 22 ఈటీఎఫ్‌ మాదిరే ‘భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌’ను కూడా స్టాక్‌ ఎక్సేంజీల్లో లిస్ట్‌ చేస్తారు. అవసరమైనప్పుడు విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. 
  • ఒక్కో యూనిట్‌ విలువ రూ.1,000 ఉంటుంది. ఈ లెక్కన ఇన్వెస్టర్లు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. 
  • క్లోజ్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లా... మూడేళ్లు, పదేళ్ల స్థిర కాల వ్యవధితో భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ను జారీ చేస్తారు. వాటి కాలవ్యవధి వరసగా 2023లో, 2030లో ముగుస్తుంది.
  • గ్రోత్‌ ఆప్షన్‌ మాత్రమే ఉంటుంది. డివిడెండ్‌ ఆప్షన్‌ ఉండదు. 
  • రాబడులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మెరుగ్గా, స్థిరంగా ఉంటాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్‌తో (ప్రస్తుతం 6.47 శాతం) పోలిస్తే 0.50 శాతం నుంచి 1.40 శాతం వరకు అధికంగా ఉండొచ్చని అంచనా. 
  • అధిక నాణ్యత, భద్రతకు సంకేతమైన ఏఏఏ మైనస్‌, ఏఏ మైనస్‌ రేటింగ్‌ సెక్యూరిటీలు మాత్రమే ఇందులో ఉంటాయి. 
  • బాండ్‌ ఈటీఎఫ్‌లో పెట్టుబడులపై వచ్చిన మూలధన లాభాల్లోంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్‌ లాభం) మినహాయిస్తారు. ఆ తరవాతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది కనక పన్ను చాలావరకూ తగ్గుతుంది.
  • ఖర్చుల నిష్పత్తి 0.0005 శాతం. అంటే పెట్టుబడుల విలువపై ఇన్వెస్టర్ల నుంచి ఈ మేరకు వార్షికంగా నిర్వహణ చార్జీని వసూలు చేస్తారు.  
  • ప్రతి ఆరు నెలలకోసారి ఈటీఎఫ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో) ఉంటుంది. ఇందుకోసం ఎన్‌ఎస్‌ఈ ఒక ఇండెక్స్‌ను రూపొందిస్తుంది. 
  • ఈటీఎఫ్‌ అన్నది పలు బాండ్ల సమూహం. ఏదైనా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ తగిన అనుమతులకు లోబడి తన నిధుల కోసం భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ కింద బాండ్లను జారీ చేయవచ్చు. 
  • ఈ భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ నిర్వహణ బాధ్యతలను ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ చూస్తుంది. 
  • అభివృద్ధి చెందిన దేశాల్లో బాండ్‌ ఈటీఎఫ్‌ల్లో ఎక్కువగా పెన్షన్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. 

రిస్క్‌ చాలా తక్కువ
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎస్సెల్‌ గ్రూపులు.. రుణపత్రాలపై తీసుకున్న బకాయిల్ని చెల్లించటంలో విఫలమవ్వడాన్ని ఈ మధ్య చూశాం. వీటిల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు నేరుగా ఇన్వెస్ట్‌ చేసినా, లేక మ్యూచువల్‌ ఫండ్స్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసినా డిఫాల్ట్‌ రిస్క్‌ ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకురానున్న భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ ఈటీఎఫ్‌ కింద బాండ్ల రూపంలో నిధులు సమీకరించేవన్నీ ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలే. ప్రభుత్వ రంగ సంస్థలు రుణ చెల్లింపుల్లో విఫలం కావడం ఇప్పటి వరకు అరుదే. ఎందుకంటే వీటి వెనుక ప్రభుత్వం ఉంటుంది. చెల్లింపుల్లో విఫలమయ్యే పరిస్థితే వస్తే ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. కనుక ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి రిస్క్‌ దాదాపు ఉండదనే భావించొచ్చు. 
డెట్‌ ఈటీఎఫ్‌ ప్రారంభానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. తక్కువ వ్యయానికే నాణ్యమైన ప్రభుత్వరంగ సంస్థల బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ మరింత వృద్ధి చెందేందుకు ఇది తోడ్పాటునిస్తుందన్నారు.
 -------
లిక్విడిటీతో కూడిన, నాణ్యమైన ప్రభుత్వరంగ బాండ్లలో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. మరింత మంది ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యానికి ఇది వీలు కల్పిస్తుంది. 
- ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌, సీఈవో, యాంఫి

ప్రభుత్వరంగ సంస్థలకు నిధుల సమీకరణకు ఇదొక కొత్త మార్గంగా సాయపడుతుంది. ప్రారంభంలో 3 ఏళ్లు, 10 ఏళ్ల మెచ్యూరిటీతో భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ఉంటుంది. 
- రాధికా గుప్తా, సీఈవో, ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ

బాండ్‌ ఈటీఎఫ్‌లో కనీస పెట్టుబడి రూ.1,000గా ఉండటం రిటైల్‌ ఇన్వెస్టర్లకు చాలా మంచిది. వారు తక్కువ రిస్క్‌తో కూడిన కార్పొరేట్‌ బాండ్లలో పాల్గొనేందుకు ఇదో మంచి అవకాశం.
- అనిల్‌ గుప్తా, వైస్‌ ప్రెసిడెంట్‌, ఇక్రా. 



You may be interested

లాభాలతో ప్రారంభం

Thursday 5th December 2019

ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో గురువారం స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభంతో 40,988 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల పెరుగుదలతో 12,071 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ... అదుర్స్‌

Thursday 5th December 2019

166 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఇష్యూ  ఈ ఏడాది అత్యధికంగా సబ్‌స్క్రైబయిన ఇష్యూ ఇదే  ఈ నెల 12న లిస్టింగ్‌  న్యూఢిల్లీ: ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) అదరగొట్టింది. బుధవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.750 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా 12.39 కోట్ల షేర్లు ఆఫర్‌ చేస్తుండగా, 2,053 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు కేటాయించిన వాటా 114

Most from this category