News


కొత్త ఏడాదిలో కొనదగ్గ బ్లూచిప్స్‌

Wednesday 25th December 2019
Markets_main1577268138.png-30431

టెలికంలో భారతీ ఎయిర్‌టెల్‌
డైవర్సిఫైడ్‌ విభాగంలో ఆర్‌ఐఎల్‌
ఐసీఐసీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ భేష్‌

ఈ ఏడాది ప్రారంభంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి ఊపందుకున్నాయి. మధ్యలో తిరిగి భారీ ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరికి నిలదొక్కుకుని ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఎఫ్‌ఫీఐలపై ట్యాక్స్‌ సర్‌చార్జ్‌, దేశ జీడీపీ మందగమనం, ద్రవ్యలోటు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును బలహీనపరచగా.. రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల తగ్గింపు, ఎఫ్‌ఫీఐల ట్యాక్స్‌ సర్‌చార్జ్‌పై కేంద్రం వెనకడుగు,  కార్పొరేట్‌ ట్యాక్స్‌లో కోత వంటి అంశాలు సానుకూలతకు కారణమయ్యాయి. కాగా.. మరోపక్క అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు.. తొలుత ప్రపంచ ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. అయితే ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు నుంచి యూటర్న్‌ తీసుకుని ఫండ్స్‌ రేట్లను తగ్గించడం, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి ప్రాథమిక దశ ఒప్పందం కుదరడం వంటి అంశాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. వెరసి అటు అమెరికా స్టాక్‌ మార్కెట్లు రికార్డ్‌ ర్యాలీ చేయగా.. ఇటు సెన్సెక్స్‌, నిఫ్టీ సైతం తాజాగా చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. రానున్న బడ్జెట్‌పై అంచనాల నేపథ్యంలో వచ్చే ఏడాది సైతం బుల్లిష్‌ ధోరణి కొనసాగనుందన్న అంచనాలు పెరిగాయి. దీంతో పలు బ్రోకింగ్‌ సంస్థలు బ్లూచిప్స్‌తోపాటు నాణ్యమైన మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ కొనుగోలుకి సిఫారసు చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌-  ప్రస్తుత ధర రూ. 1546
టెలికం, రిటైల్‌ రంగాల ఆదాయం, లాభదాయకత మెరుగుపడుతున్న నేపథ్యంలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) కౌంటర్‌కు బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు మోతీలాల్‌ ఓప్వాల్‌ పేర్కొంది. ఇందుకు అనుగుణంగా గతంలో ఇచ్చిన షేరు టార్గెట్‌ ధరను రూ. 1716 నుంచి రూ. 1844కు పెంచింది. స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు(జీఆర్‌ఎం) సైతం బలపడుతున్న కారణంగా రెండేళ్ల కాలంలో నిర్వహణ లాభం 25 శాతం చొప్పున పెరిగే వీలున్నట్లు మోతీలాల్‌ భావిస్తోంది.

భారతీ ఎయిర్‌టెల్‌- ప్రస్తుత ధర రూ. 457

టెలికం రంగంలో టారిఫ్‌ల పోటీ తగ్గడంతో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు కొనుగోలుకి సిఫారసు చేస్తున్నట్లు క్రెడిట్‌ సూసీ పేర్కొంది. ధరల ఒత్తిడి తగ్గడంతో కంపెనీ లాభదాయకత మెరుగుపడనున్నట్లు అంచనా వేసింది. ఏడాది కాలానికి రూ. 517 టార్గెట్‌ ధరను ప్రకటించింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌- ప్రస్తుత ధర రూ. 541
భారీ మొండిబకాయిలు(ఎన్‌పీఎల్‌), రుణ వ్యయాల వంటి ప్రతికూల పరిస్థితులను ప్రయివేట్‌ రంగ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ సమర్ధవంతంగా ఎదుర్కొన్నట్లు ఎలారా క్యాపిటల్‌ అభిప్రాయపడింది. అనుబంధ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా లాభదాయకతను నిలుపుకుంటూ వచ్చినట్లు తెలియజేసింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరుకి రూ. 591 టార్గెట్‌ ధరతో బై రేటింగ్‌ను ఇచ్చింది.

బజాజ్‌ ఫైనాన్స్‌- ప్రస్తుత ధర రూ. 4138
వేగవంతమైన వృద్ధి, పటిష్ట లాభాలు, ఆస్తుల నాణ్యత వంటి ఆకర్షణీయ ఫలితాలతో బజాజ్‌ ఫైనాన్స్‌ 2019లో ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకున్నట్లు షేర్‌ఖాన్‌ పేర్కొంది. షేరు విలువ అధికంగా ఉన్నప్పటికీ అత్యున్నత పనితీరు చూపే ఇలాంటి కంపెనీలకు డిమాండ్‌ కొనసాగుతుందని అభిప్రాయపడింది. వెరసి బజాజ్‌ ఫైనాన్స్ షేరును రూ. 4400 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చంటూ సూచిస్తోంది.

రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌-  ప్రస్తుత ధర: రూ. 342
దేశీయంగా పొదుపు సొమ్మును పెట్టుబడుల కోసం ఆకట్టుకోవడం(ఫైనాన్షియలైజేషన్‌)లో రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ముందున్నట్లు షేర్‌ఖాన్‌ నిపుణులు లలితాబ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇకపై కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) బలపడే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ షేరుకి రూ. 427 టార్గెట్‌ ధరతో బై రేటింగ్‌ను ప్రకటించారు.

ఇంద్రప్రస్థ గ్యాస్‌- ప్రస్తుత ధర: రూ. 431
వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు వీలుగా ఇంద్రప్రస్థ గ్యాస్‌ ప్రణాళికలు వేసినట్లు ప్రభుదాస్‌ లీలాధర్‌ పేర్కొంది. దీంతో 2020-24 కాలంలో కంపెనీ అమ్మకాల పరిమాణం రెట్టింపయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో విస్తరణ, అనుబంధ సంస్థల మద్దతు వంటి సానుకూల అంశాల కారణంగా  ఈ షేరుని రూ. 468 టార్గెట్‌ ధరతో సొంతం చేసుకోవచ్చునంటూ అభిప్రాయపడింది.You may be interested

స్టార్టప్‌.. రౌండప్‌...

Wednesday 25th December 2019

యూఎస్‌, చైనా తర్వాత అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ భారత్‌లోనే ఉంది. దేశంలో దాదాపు 50వేల స్టార్టప్స్‌ ఉన్నాయి. వీటిలో పది శాతం వరకు ఫండింగ్‌ పొందాయి. యువ జనాభా అధికంగా ఉన్న భారత్‌లో స్టార్టప్‌ బూమ్‌ మరింతగా ఉండాల్సిఉందని, కానీ కొన్ని సవాళ్ల కారణంగా జోరందుకోలేకపోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ స్టార్టప్‌ రంగంలో 2019 తీసుకువచ్చిన మార్పులు, చేర్పులు చాలా ఉన్నాయి. బడా డీల్స్‌ నుంచి భారీ ఫండ్‌రైజింగ్‌ల దాకా

వచ్చే డిసెంబర్‌కల్లా 1620 డాలర్లస్థాయికి పసిడి

Wednesday 25th December 2019

వచ్చే ఏడాదిలో పసిడి ధర 1600 డాలర్ల పైన ట్రేడ్‌ అయ్యే అవకాశం ఏఎన్‌జెడ్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ తన నివేదికలో తెలిపింది. ఈ ఏడాది మాదిరిగానే 2020లో పసిడి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని, ఇతర విలువైన కమోడిటీల కంటే 2020లో ఎక్కువ లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచుతుందని బ్యాంకింగ్‌ గ్రూప్‌ అభిప్రాయపడింది. వచ్చే ప్రారంభం నుంచి పసిడి ధర క్రమంగా పెరుగుతూ ఏడాది చివరి నెల డిసెంబర్‌ నాటికి 1620 డాలర్ల

Most from this category