News


యాంఫీ రీజిగ్‌- ఈ మిడ్‌ క్యాప్స్‌ దారెటు?

Monday 6th January 2020
Markets_main1578291987.png-30701

ఇన్ఫో ఎడ్జ్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌
కన్సాయ్‌ నెరోలాక్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌

యస్‌ బ్యాంక్‌, కేడిలా హెల్త్‌కేర్‌
ఐబీ హౌసింగ్‌, వొడాఫోన్‌ ఐడియా

దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌(యాంఫీ) తాజాగా మిడ్‌ క్యాప్‌ విభాగంలో కొన్ని మార్పులు చేపట్టింది. దీంతో లిస్టెడ్‌ మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో కొన్ని లార్జ్‌ క్యాప్‌ విభాగంలోకి చేరనుండగా.. మరికొన్ని లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌గా అవతరించనున్నాయి. దీంతో దేశీయంగా మ్యూచువల్‌ ఫం‍డ్స్‌(ఎంఎఫ్‌లు) పెట్టుబడుల ప్రాధాన్యతలో ఇకపై కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..

మిడ్‌ క్యా‍ప్స్‌ టు లార్జ్‌ క్యాప్స్‌
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకు అనుగుణంగా ప్రతీ ఆరు నెలలకోసారి యాంఫీ లిస్టెడ్‌ కంపెనీల వర్గీకరణ(రీక్లాసిఫికేషన్‌)లో సవరణలు చేపడుతుంటుం‍ది. దీనిలో భాగంగా వారాంతాన ఐదు మిడ్‌ క్యాప్‌ కంపెనీలకు లార్జ్‌ క్యాప్స్‌గా ప్రమోషన్‌ ఇచ్చింది. మరోవైపు ఇప్పటివరకూ లార్జ్‌ క్యాప్‌ విభాగంలో కొనసాగుతున్న ఐదు స్టాక్స్‌ను మిడ్‌ క్యాప్స్‌ జాబితాకు తరలించింది. వెరసి దేశీయంగా ఫండ్స్‌ పెట్టుబడుల్లోనూ మార్పులు చోటుచేసుకునే వీలున్నట్లు నిపుణులు తెలియజేశారు.

జాబితా ఇలా
గత వారాంతాన మిడ్‌ క్యాప్స్‌ విభాగం నుంచి లార్జ్‌ క్యాప్స్‌గా ఎదిగిన కంపెనీల జాబితాలో అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఇన్ఫో ఎడ్జ్‌, కన్సాయ్‌ నెరోలాక్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌(ఆర్‌ఈసీ) చోటు సాధించాయి. ఇక మరోవైపు ఫార్మా కంపెనీ కేడిలా హెల్త్‌కేర్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌, మొబైల్‌ టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా, ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌.. లార్జ్‌ క్యాప్‌ హోదాను కోల్పోయాయి. యాంఫీ మిడ్‌ క్యాప్‌ జాబితాలోకి చేరాయి.

ఇన్వెస్ట్‌మెంట్స్‌ దన్ను
లార్జ్‌ క్యాప్‌ జాబితాలో చేరిన కంపెనీలలో సహజంగా ఫండ్స్‌ పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తుంటాయని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌ చివరికల్లా అదానీ ట్రాన్స్‌మిషన్‌లో ఫండ్స్‌ 0.01 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ బాటలో ముత్తూట్‌ ఫైనాన్స్‌లో 6.6 శాతం, కన్సాయ్‌ నెరోలాక్‌లో 7.45 శాతం, ఆర్‌ఈసీలో 7.15 శాతం, ఇన్ఫో ఎడ్జ్‌లో 13.6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. ఈ కంపెనీలలో ఇకపై ఫండ్స్‌ మరిన్ని పెట్టుబడులకు దిగే అవకాశమున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ ఇటీవల రెండేళ్లుగా లార్జ్‌క్యాప్స్‌లోకే అధికంగా పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు తెలియజేశారు.

ఇదీ తీరు
2018 ప్రారంభంలో సెబీ తొలిసారి రీక్లాసిఫికేషన్‌ను అమలు చేసిన తదుపరి లార్జ్‌ క్యాప్స్‌ భారీగా పెట్టుబడులను ఆకట్టుకోగా.. చిన్న షేర్లు బాగా వెనకబడినట్లు నిపుణులు తెలియజేశారు. 2018 కేలండర్‌ ఏడాదిలో సెన్సెక్స్‌ 22 శాతం లాభపడగా.. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 15 శాతం, స్మాల్‌ క్యాప్‌ 27 శాతం చొప్పున క్షీణించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. జనవరి 2018 నుంచి చూస్తే.. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 58 శాతం, ముత్తూట్‌ ఫైనాన్స్‌ 64 శాతం, ఇన్ఫో ఎడ్జ్‌ 85 శాతం చొప్పున దూసుకెళ్లడం విశేషం! అయితే ఇదే సమయంలో కన్సాయ్‌ నెరోలాక్‌, ఆర్‌ఈసీ 10 శాతం చొప్పున తిరోగమించాయి.

నేలచూపులతో
లార్జ్‌ క్యాప్స్‌ హోదాను కోల్పోయి తాజాగా మిడ్‌ క్యాప్స్‌గా మారిన కంపెనీలు 2018 నుంచి చూస్తే నేలచూపులకే పరిమితమవుతూ వస్తున్నాయి. జాబితాలో కేడిలా హెల్త్‌కేర్‌, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌, వొడాఫోన్‌ ఐడియా, యస్‌ బ్యాంక్‌ 40-95 శాతం మధ్య పతనమయ్యాయి. దీంతో ఇప్పటికే ఫండ్స్‌ విముఖత చూపుతున్న ఈ కౌంటర్లలో ఇకపైన కూడా పెట్టుబడుల ఉపసంహరణకు వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే సెప్టెంబర్‌కల్లా యస్‌ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌, ఎస్‌బీఐ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ వంటి సంస్థలు 1 శాతంపైగా వాటాను కలిగి ఉన్నాయి. ఇక వొడాఫోన్‌లో దేశీ ఫండ్స్‌ వాటా 5 శాతంపైగా నమోదైంది. దీంతో ఈ కౌంటర్లలో భారీ అమ్మకాలకూ అవకాశంలేదని మరికొంతమంది విశ్లేషకులు వివరించారు. ఇప్పటికే అటు లార్జ్‌ క్యాప్స్‌గా ప్రమోషన్‌ పొందిన కౌంటర్లలో ర్యాలీరావడం, మిడ్‌క్యాప్స్‌ జాబితాలోకి చేరిన కౌంటర్లు పతనంకావడంతో పెట్టుబడుల మార్పిడి యాక్టివిటీ తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే విధంగా స్మాల్‌ క్యాప్స్‌ నుంచి మిడ్‌ క్యాప్స్‌ విభాగంలోకి చేరిన జేకే సిమెంట్‌, పీవీఆర్‌లను ప్రస్తావిస్తున్నారు. జేకే సిమెంట్‌లో సెప్టెంబర్‌కల్లా ఫండ్స్‌ 21 శాతం వాటాను సొంత చేసుకున్నట్లు తెలియజేశారు. కాగా.. పెట్టుబడి ప్రణాళికలలో భాగంగా లార్జ్‌ క్యాప్‌ పథకంలో 80 శాతాన్ని, మిడ్‌ క్యాప్‌లో అయితే 65 శాతాన్ని కనీస పెట్టుబడులుగా ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేయవలసి ఉంటుంది.



You may be interested

మార్కెట్‌ భారీ పతనానికి కారణాలివే..!

Monday 6th January 2020

ఇరాన్‌ అమెరికాల భౌగోళికల ఉద్రిక్తతలు మరింత ఉధృతం కావడంతో సోమవారం ఉదయం సెషన్‌లోనే దేశీయ స్టాక్‌మార్కెట్లో భారీగా అమ్మకాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 2శాతానికి పైగా పెరిగి 70డాలర్లకు చేరుకోవడం కూడా కూడా విక్రయాలకు మద్దతునిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 541 పాయింట్లు నష్టపోయి 41వేల మార్కు దిగువన 40,923 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో నిప్టీ సూచీ 164 పాయింట్లు పతనమైన 12100 స్థాయిని కోల్పోయి 12,062.85

ఆకాశాన్నంటిన బంగారం ధర

Monday 6th January 2020

రెండురోజుల్లో రూ.1800లు పెరిగిన బంగారం కలిసొచ్చిన ఇరాన్‌ - అమెరికా ఉద్రిక్తతలు  దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర సోమవారం మరోసారి ఆకాశానికి ఎగసింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర నేటి ఉదయం సెషన్‌లో ఏకంగా రూ.984లు లాభపడింది. ఉదయం గం.10:15ని.లకు రూ.890ల లాభంతో రూ.41012 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇరాన్‌ - అమెరికా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 36డాలర్లు ర్యాలీ చేసి ఏడేళ్ల గరిష్టాన్ని అందుకోవడం,

Most from this category