News


మార్కెట్‌ దిశ ఎటు!

Monday 5th August 2019
Markets_main1564991854.png-27546

-ఆర్‌బీఐ పాలసీ, ఎఫ్‌పీఐలకు పన్ను ఊరట అంశాలపై దృష్టి 
- బుధవారం కీలక వడ్డీ రేట్ల ప్రకటన
- 25 బేసిస్‌ పాయింట్ల తగ్గింపు ఉండవచ్చని అంచనా..
- చైనా-అమెరికా వాణిజ్య చర్చలపై మార్కెట్‌ దృష్టి
- ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, టైటాన్, హెచ్‌సీఎల్‌, బీపీసీఎల్‌, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ క్యూ1 ఫలితాలు ఈవారంలోనే..

ముంబై: గడిచిన నాలుగు వారాల్లో ఆరు శాతం నష్టాలను నమోదుచేసి, బేర్‌ గుప్పిట్లో ఉన్న అంశాన్ని స్పష్టంచేసిన దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు.. గతవారాంతాన ఒక్కసారిగా షార్ప్‌ రికవరీని ప్రదర్శించి ఈ పట్టులోంచి బయటపడుతున్న సంకేతాలను పంపాయి. అయితే, కీలక నిరోధస్థాయిలను దాటలేకపోయిన కారణంగా.. మార్కెట్‌ ఇక్కడ నుంచి ఏ దిశను తీసుకుంటుందనే అంశం పరంగా ఈ వారం ట్రేడింగ్‌ అత్యంత కీలకంగా మారిపోయింది. ఈ స్థాయిల నుంచి మద్దతు తీసుకుని బేర్‌ పంజా నుంచి బయటపడతాయా..? లేదంటే, బుల్స్‌ను చిత్తుచేసి మరింత పతనాన్ని నమోదుచేయనున్నాయా అనే అంశాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష, అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వంటి పలు కీలక పరిణామాలు సమాధానాలుగా నిలవనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్‌పీఐ) సర్‌చార్జ్‌కి సంబంధించి ఈవారంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వెసులుబాటును కల్పించినా మార్కెట్లో బౌన్స్‌-బ్యాక్‌ ఉండేందుకు ఆస్కారం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. 

వడ్డీ రేట్ల కోతకు అవకాశం..!
ఆర్‌బీఐ గవర్నర్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈనెల 5న (సోమవారం) సమావేశంకానుంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లు తగ్గేందుకు అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షపై కమిటీ కీలక ప్రకటన చేయనుండగా.. ఈసారి కనీసం 25 బేసిస్‌ పాయింట్ల కోత ఉండవచ్చని ఇక్రా అంచనావేసింది. ఇండియా రేటింగ్‌, కేర్‌ రేటింగ్స్‌, ఎస్‌బీఐ కూడా ఇదే అంచనాను వెల్లడిస్తుండగా.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విశ్లేషకులు సమీర్‌ మాత్రం 50 బేసిస్‌ పాయింట​వరకు వడ్డీ రేట్ల తగ్గింపు ఉండవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆర్థిక వృద్ధి రేటుపై కొనసాగుతున్న ఆందోళనలు, ద్రవ్యోల్బణ అంశాల ఆధారంగా ఆర్‌బీఐ పావు శాతం నుంచి అరశాతం వరకు వడ్డీ రేట్లను తగ్గించవచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్‌ సీనియర్ ఎకనామిస్ట్ సువోదీప్ రక్షీత్ అన్నారు. ఆర్‌బీఐ ప్రకటన ఇప్పుడు మార్కెట్‌కు అత్యంత కీలకంగా మారిపోయిందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 

- 900 కంపెనీల క్యూ1 ఫలితాలు
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (మంగళ).. టైటాన్ (బుధ).. సిప్లా, మహీంద్ర అండ్‌ మహీంద్ర, అరబిందో ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, వోల్టాస్, హెచ్‌పీసీఎల్‌ టాటా స్టీల్, సిమెన్స్, (గురు).. అల్ట్రాటెక్ సిమెంట్, ఇమామి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ శుక్రవారం తమ​క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదే వారంలో.. క్యాడిలాహెల్త్‌, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్, గెయిల్, బీహెచ్‌ఈఎల్‌, బీపీసీఎల్, ఆయిల్ ఇండియా, దిలీప్ బిల్డ్‌కాన్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ, ఆర్‌ఈసీ, అదానీ గ్యాస్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్, కేఈసీ ఇంటర్నేషనల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, మహానగర్ గ్యాస్, హెక్సావేర్, బ్రిటానియా, నాట్కో ఫార్మాలతో పాటు మొత్తం 900 కంపెనీల ఫలితాలు వెల్లడికానున్నాయి.

వాణిజ్య చర్చలపై మార్కెట్‌ దృష్టి
అమెరికాల-చైనాల మధ్య వాణిజ్య చర్చలు మంగళవారం నుంచి షాంఘైలో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల్లో ఇరు దేశాలకు చెందిన వాణిజ్య ప్రతినిధులు పాల్గొనున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ప్రతిష్టంభనను తొలగించేందుకు ఈ చర్చలు ఏమేరకు ఉపయోగపడతాయో అన్న విషయంపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు జపాన్‌ ఏప్రిల్‌-జూన్‌ జీడీపీ డేటా శుక్రవారం వెల్లడికానుంది. జూలై నెల ఐహెచ్‌ఎస్‌ మార్కెట్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ సోమవారం వెల్లడికానుంది.

ఈవారంలో రెండు ఐపీఓలు
ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఏర్పాటైన మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ స్పందన స్ఫూర్తి  ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఆగస్టు 5న(సోమవారం) ప్రారంభమై.. ఈ నెల 7న ముగియనుంది. ధరల శ్రేణి రూ.853-856 కాగా, మార్కెట్‌ లాట్‌ 17 షేర్లుగా కంపెనీ ప్రకటించింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.1200 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తుంది. ఈ నెల 19న కంపెనీ ఎక్చ్సేంజీల్లో కంపెనీ షేర్లు లిస్ట్‌ కానున్నాయి. ఇక సౌర విద్యుత్‌ రంగంలో ఈపీసీ సొల్యూషన్లు అందించే ముంబై కంపెనీ స్టెర్లింగ్ అండ్‌ విల్సన్ సోలార్ ఐపీఓ 6న (మంగళవారం) ప్రారంభంకానుంది. ఈ నెల 8న ముగియనున్న ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.775-780గా కంపెనీ నిర్ణయించగా.. మార్కెట్‌ లాట్‌ 19 షేర్లుగా నిర్ణయించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.3,125 కోట్లను సమీకరించనుంది. మరోవైపు 86 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయిన మొబైల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఆఫిల్‌ ఇండియా గురువారం లిస్టింగ్‌కు రానుంది. 

2 రోజుల్లో రూ.2,881 కోట్ల విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1-2, రెండురోజుల్లో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.2,633 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. డెట్‌ మార్కెట్‌ నుంచి మరో రూ.248 కోట్లను వెనక్కు తీసుకోవడం ద్వారా ఈనెల్లో వీరు మొత్తం రూ.2,881 కోట్లను ఉపసంహరించుకున్నారు. You may be interested

ఇంటి వద్దకే బైక్‌, స్కూటర్‌ డెలివరీ

Monday 5th August 2019

హీరో మోటోకార్ప్‌ ప్రణాళికలు న్యూఢిల్లీ: దేశ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉన్న హీరో మోటోకార్ప్‌ బైక్‌, స్కూటర్లను కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేసే ప్రణాళికలతో ఉంది. ఇప్పటికే ముంబై, బెంగళూరు, నోయిడాలో ఈ సేవలను ఆరంభించగా, రానున్న కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా మరో 25 పట్టణాలకు విస్తరించాలనుకుంటోంది. ‘‘వినూత్న విధానాల అబివృద్ధికి, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్నిచ్చే వ్యాపార నమూనాల కోసం పెట్టుబడులు పెడుతూనే ఉన్నాం. మా నూతన విధానం

మరోసారి ఆర్‌బీఐ రేట్ల కోత!

Monday 5th August 2019

- ఈ నెల 7న పాలసీ సమీక్ష నిర్ణయం... - కీలక వడ్డీరేట్లలో పావు శాతం తగ్గింపునకు అవకాశం... - బ్యాంకర్లు, నిపుణుల అంచనా... న్యూఢిల్లీ: ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల కోతకు సై అంటుందా? కీలక గణాంకాలన్నీ మందగమనాన్ని స్పష్టంగా చూపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు వరుసగా నాలుగోసారి కీలక పాలసీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల

Most from this category