News


2020లో పెట్టుబడులకు 15 స్టాక్స్‌

Wednesday 22nd January 2020
Markets_main1579680096.png-31100

గత రెండేళ్లుగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ప్రధాన కంపెనీలు ర్యాలీ చేస్తూవచ్చాయని, ఇకపై ఈ పరిస్థితి మారనుందని బ్రోకింగ్‌ సంస్థలు చెబుతున్నాయి. జీడీపీ బలపడేందుకు వీలుగా బడ్జెట్లో ప్రభుత్వం చర్యలు, ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్లు అంచనా వేశాయి. దీంతో ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాలు పుంజుకోనున్నట్లు తెలియజేశాయి. వెరసి 2020లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం 15-20 శాతం స్థాయిలో రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో మార్కెట్లు 10-12 శాతం వృద్ధి చూపవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో పెట్టుబడుల కోసం బ్లూచిప్స్‌తోపాటు మిడ్‌ క్యాప్‌ విభాగంలోని 15 స్టాక్స్‌ను కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌, గ్లోబ్‌ కేపిటల్‌ ఎంపిక చేశాయి. వివరాలు చూద్దాం.. 

గ్లోబ్‌ కేపిటల్‌ సిఫారసులు
1. డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ 
దేశంలోనే అతిపెద్ద రియల్టీ కంపెనీ డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌(క్యూ2)లో రూ. 181 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1తో పోలిస్తే అమ్మకాలు 29 శాతం పెరిగి రూ. 1715 కోట్లను తాకింది. కాగా.. రూ. 12,000 కోట్ల ఇన్వెంటరీని మూడునాలుగేళ్లలో విక్రయించే అవకాశముంది. 
2. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌
ఐసీఐసీఐ బ్యాంక్‌, ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ హోల్డింగ్స్‌ ప్రమోట్‌ చేసిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 2001లో కార్యకలాపాలు ప్రారంభించింది. తదుపరి అగ్రగణ్య ప్రయివేట్‌ రంగ జీవిత బీమా కంపెనీలలో ఒకటిగా నిలకడను చూపుతోంది. రూ. లక్ష కోట్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) సాధించిన తొలి కంపెనీగా ఆవిర్భవించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పలు చానల్స్‌ ద్వారా సర్వీసులను విస్తరించింది. తద్వారా అమ్మకాలు పెంచుకుంటోంది.
3. సన్‌ ఫార్మాస్యూటికల్‌
స్పెషాలిటీ జనరిక్‌ కంపెనీలలో సన్‌ ఫార్మాస్యూటికల్‌.. ప్రపంచంలోనే నాలుగో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. యూఎస్‌ఏలో 8వ ర్యాంకులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 44 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. అంతర్జాతీయంగా 2,000 ప్రొడక్టులను విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్పెషాలిటీ బిజినెస్‌లో వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది.
4. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌.. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ. స్టీల్‌ తయారీలో సమీకృత కార్యకలాపాలు కలిగి ఉంది. దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. 100 దేశాలకుపైగా కార్యకలాపాలు విస్తరించింది. ఆటోమోటివ్‌ పరిశ్రమ కోసం అత్యంత పటిష్టమైన, ఆధునిక హైఎండ్‌ స్టీల్‌ ప్రొడక్టులను తయారు చేస్తున్న తొలి దేశీ కంపెనీగా ఎదిగింది. 
5. ఏసీసీ లిమిటెడ్‌
దేశీయంగా సిమెంట్‌ తయారీలో అతి ప్రాచీనమైన కంపెనీ ఏసీసీ రెడీ మిక్స్‌డ్‌ కాం‍క్రీట్‌ తయారీలోనూ పేరొందింది. దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లు, మార్కెటింగ్‌ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. 1936లో ప్రారంభమైన కంపెనీ సిమెంట్‌, కాంక్రీట్‌ టెక్నాలజీలలో అత్యున్నత స్థానంలో నిలుస్తోంది. దేశీయంగా కంపెనీ బ్రాండు సిమెంట్‌కు మారుపేరుగా సుప్రసిద్ధమైంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం సిమెంట్‌కు డిమాండ్‌ను పెంచనుంది. తద్వారా ధరలు బలపడనున్నాయి. 

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌
1. గెయిల్‌ ఇండియా
దేశీయంగా గ్యాస్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌లో గెయిల్‌ ఇండియా అగ్రస్థానంలో ఉంది. త్వరలో ప్రారంభంకానున్న ఈస్టర్న్‌ కారిడార్‌ పైప్‌లైన్‌లో అత్యధిక వాటాను కలిగి ఉండటంతో భవిష్యత్‌లో మరింత వృద్ధికి అవకాశముంది. నేచురల్‌ గ్యాస్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా అమ్మకాల పరిమాణాన్ని పెంచుకోనుంది. అంతర్జాతీయంగా నిలకడను చూపుతున్న గ్యాస్‌ ధరలు కంపెనీకి లబ్దిని చేకూర్చగలవు. వీటికి అదనంగా యూఎస్‌ లిక్విఫికేషన్‌ టెర్మినల్స్‌ ద్వారా ఆర్‌ఎల్‌ఎన్‌జీ ఎగుమతులు పుంజుకోనున్నాయి.      
2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
రిటైల్‌ రంగ రుణాలలో అత్యధిక శాతం ఫిక్స్‌డ్‌ కేటగిరీకి చెందినవేకావడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వడ్డీ రేట్ల రిస్క్‌లను తగ్గించుకోగలుగుతుంది. రెపో రేటుకు రుణాలకు లింక్‌ చేసిన నేపథ్యంలో నికర వడ్డీ మార్జిన్లను 4.1-4.3 శాతం స్థాయిలో నిలుపుకోగలుగుతుంది. రానున్న నాలుగేళ్ల కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 22 శాతం వార్షిక వృద్ధిని సాధించే అవకాశముంది. 2 శాతం ఆర్‌వోఏను నమోదు చేసే వీలుంది. దీంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) ప్రస్తుత 100 బిలియన్‌ డాలర్ల నుంచి 200 బిలియన్‌ డాలర్లకు బలపడవచ్చు.
3. ఐటీసీ లిమిటెడ్‌
కార్పొరేట్‌ ట్యాక్స్‌లో కోతను ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ తగిన విధంగా వినియోగించుకునే అవకాశముంది. వాణిజ్య పథకాలకు వినియోగించడం ద్వారా అమ్మకాల పరిమాణం పెంచుకోవచ్చు. కంపెనీ పటిష్ట క్యాష్‌ఫ్లోలను సాధిస్తుండటంతో డీలర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రత్యర్థి కంపెనీలకంటే ముందుండే వీలుంది. ధరలు తగ్గించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడానికీ అవకాశముంది. తద్వారా గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ నుంచి కింగ్‌ సైజ్‌ విభాగంలో ఎదురవుతున్న పోటీకి ధీటుగా అమ్మకాలు పెంచుకునేందుకు వీలుంటుంది. అంతేకాకుండా డీలక్స్‌ ఫిల్టర్‌ విభాగంలో వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌కు కోల్పోయిన మార్కెట్‌ వాటాను తిరిగి పొందవచ్చు. ఇప్పటికే క్యూ2లో అమ్మకాల టర్న్‌అరౌండ్‌ సాధించింది. రెండేళ్ల కాలంలో అమ్మకాలు 10 శాతం, నికర లాభం 16 శాతం చొప్పున పుంజుకోగలవని అంచనా.
4. ఎంఅండ్‌ఎం
విభిన్న ప్రొడక్టులను ప్రవేశపెట్టడం‍ ద్వారా ఆటో పరిశ్రమలో నెలకొన్న మందగమన పరిస్థితుల్లోనూ ఎంఅండ్‌ఎం పటిష్ట పనితీరును చూపుతోంది. అయితే ఆటో రంగంలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ షేరు రీజనబుల్‌ విలువలో ఉంది. దేశీయంగా ఆటో రంగంలోని లార్జ్‌ క్యాప్స్‌లో ఎంఅండ్‌ఎం చౌకగా లభిస్తున్నట్లుగా భావించవచ్చు. ఆటో పరిశ్రమ జోరందుకుంటే.. వాణిజ్య వాహనాలు, ప్రయాణికుల వాహన విభాగంలో మార్కెట్‌ వాటాను పెంచుకోగలదు.
5. స్టేట్‌బ్యాంక్‌
రుణ వృద్ధి ఊపందుకుంటే.. మొట్టమొదట స్టేట్‌బ్యాంక్‌ లబ్ది పొందగలదని చెప్పవచ్చు. 12.89 శాతం సీఏఆర్‌ కలిగిన బ్యాంకు పెట్టుబడుల విషయంలో పటిష్టంగా ఉంది. టైర్‌ 1, టైర్‌ 2 బాండ్లు, ఎస్సార్‌ స్టీల్‌ ప్రొసీడింగ్స్‌తోపాటు.. ఎస్‌బీఐ కార్డ్స్‌, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ వాటా విక్రయం ద్వారా వృద్ధికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకోనుంది. తద్వారా తాజా పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వంపై అంతగా ఆధారపడవలసిన అవసరముండదు. భవిష్యత్‌లో ఎస్‌బీఐ నికర వడ్డీ మార్జిన్లు మరింత బలపడే అవకాశముంది.

6. యూపీఎల్‌
అరిస్టా కొనుగోలు తదుపరి అగ్రి కెమికల్స్‌ దిగ్గజం యూపీఎల్‌ వృద్ధి బాట పట్టింది. ఇందుకు పలు అవకాశాలు కనిపిస్తు‍న్నాయి. దీంతో​అమ్మకాలు, మార్జిన్లు బలపడనున్నాయి. రెండు కంపెనీల మధ్య ఏకరూప్యతల ద్వారా సమీపకాలంలో అమ్మకాలు, నికర లాభం మరింత మెరుగుపడే అవకాశముంది. 
7. సైయెంట్‌ లిమిటెడ్‌
ఆదాయంలో నామమాత్ర వృద్ధి, తక్కువస్థాయిలో నమోదవుతున్న మార్జిన్ల నేపథ్యంలో ఐటీ కంపెనీ సైయెంట్‌ లిమిటెడ్‌ షేరు చౌకగా ట్రేడవుతోంది. రానున్న త్రైమాసికాలలో సైయెంట్‌ టర్న్‌అరౌండ్‌ కాగలదని అంచనా. తద్వారా మార్జిన్లను బలపరచుకునేందుకు వీలు చిక్కుతుంది. ఈ ఏడాది క్యూ4 వరకూ పునర్వ్యవస్థీకరణ వ్యయాలు నమోదుకానున్నాయి. సాధారణ పాలన, విక్రయ వ్యయాలను నియంత్రించుకోవడం ద్వారా స్థూల మార్జిన్లను మెరుగుపరచుకోనుంది.
8. కేపీఆర్‌ మిల్‌
దుస్తుల విభాగం కేపీఆర్‌ మిల్‌ వృద్ధికి వెన్నెముకగా నిలుస్తోంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో దుస్తుల విభాగం ఆదాయంలో 46 శాతం వాటాను ఆక్రమించింది. చాలా ఏళ్ల తరువాత దేశీయ అమ్మకాలు ఎగుమతులను మించాయి. ఇన్నర్‌వేర్‌ విభాగంలో ప్రవేశపెట్టిన ఫాసో బ్రాండ్‌ అమ్మకాలు జోరు చూపుతున్నాయి. మొత్తం అమ్మకాలలో దేశీ వాటా 62 శాతానికి చేరింది. దుస్తుల అమ్మకాలు 25 శాతం ఎగసి రూ. 768 కోట్లను తాకాయి. దీంతో స్థూల మార్జిన్లు 3.2 శాతంమేర బలపడ్డాయి. రానున్న రెండేళ్లలో ఇబిటా మార్జిన్లు 1.1 శాతం, 1.9 శాతం చొప్పున మెరుగుపడగలవని అంచనా.
9. సన్‌టెక్‌ రియల్టీ
అత్యంత వ్యయభరిత(హైఎండ్‌ ప్రీమియం) రెసిడెన్షియల్‌, వాణిజ్య సముదాయాల అభివృద్ధిలో సన్‌టెక్‌ రియల్టీ కార్యకలాపాలు విస్తరిస్తోంది. ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం‍లో కంపెనీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గత దశాబ్ద కాలంలో 30 మిలియన్‌ చదరపు అడుగులలో 25 ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. 2023కల్లా 12 మిలియన్‌ చదరపు అడుగుల ప్రాజెక్టులను పూర్తి చేసే వీలుంది. దీంతో పటిష్ట క్యాష్‌ఫ్లోలను సాధిస్తోంది. రియల్టీ రంగంలో ఆర్గనైజ్‌డ్‌ కంపెనీలకు పెరుగుతున్న డిమాండ్‌ సన్‌టెక్‌ రియల్టీకి లబ్ది చేకూర్చే అవకాశముంది.
10. త్రివేణీ టర్బయిన్‌
30 మెగావాట్ల శ్రేణిలో స్టీమ్‌ టర్బయిన్ల తయారీ, సర్వీసులను త్రివేణీ టర్బయిన్‌ అందిస్తోంది. ఈ విభాగంలో 60 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ 22 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఇటీవల దేశీయంగా రూ. 160 కోట్ల ఆర్డర్‌ బుక్‌ను పొందింది. ఇది 107 శాతం అధికంకాగా.. విదేశాల నుంచీ 23 శాతం ఆర్డర్లను సంపాదించింది. ప్రస్తుత ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 690 కోట్లను తాకింది. వీటిలో ఎగుమతుల వాటా 42 శాతంకాగా.. పటిష్ట బ్యాలన్స్‌షీట్‌, సమర్ధవంతమైన వర్కింగ్‌ కేపిటల్‌ కంపెనీకి మరిన్ని అవకాశాలు కల్పించనున్నాయి.You may be interested

బడ్జెట్‌ రోజున బీఎస్‌ఈ ఓపెన్‌

Wednesday 22nd January 2020

ఈసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు శనివారం కావడంతో ఈ రోజు స్టాక్‌ ఎ‍క్చ్సేంజీలు పనిచేస్తాయా... లేదా..?! అనే అనుమానాలకు బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ తెరదించింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టేరోజు శనివారం అయినప్పటికీ స్టాక్‌ ఎక్చ్సేంజీ పని చేస్తుందని బీఎస్‌ఈ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సర్క్యూలర్‌ జారీచేసింది. ‘‘కేంద్రం ప్రభుత్వం ఫిబ్రవరి 1 శనివారం నాడు 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆ రోజు శనివారం

లో బడ్జెట్‌ ఐ ఫోన్‌ వచ్చేస్తుంది!

Wednesday 22nd January 2020

తక్కువ ధరతో ఐ ఫోన్‌! మార్చినాటికి మార్కెట్లో విడుదల మార్కెట్లోకి  కొత్త స్మార్ట్‌ ఫోన్లు ఎన్ని వచ్చినా.. ఐఫోన్‌కు ఉండే క్రేజ్‌ ఏమాత్రం తగ్గదు. క్రేజ్‌కు తగ్గట్టుగానే దీని ధరం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎక్కువమంది వినియోగదారులకు ఐఫోన్‌ను చేరువచేసేందుకు యాపిల్‌ కంపెనీ తక్కువ ధరలో ఐఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ కొత్త  ఐఫోన్‌ విడిభాగాల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది. ఈ ఫోన్‌ను  మార్చినాటికి వినియోగదారులకు

Most from this category