News


చమురు ధరల పతనం ఏం​చెబుతోంది?

Tuesday 10th March 2020
Markets_main1583819403.png-32386

దేశానికి ఎన్నో విధాల లాభం
చమురు దేశాల ఆర్థిక వ్యవస్థలు డీలా
ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధికి విఘాతం

ప్రపంచంలోనే చమురు ఉత్పత్తికి రెండో పెద్ద దేశమైన సౌదీ అరేబియా.. ధరల యుద్ధానికి తెర తీయడంతో అంతర్జాతీయ స్థాయిలో సోమవారం స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. చమురు ఉత్పత్తిలో మూడో పెద్ద దేశం రష్యాపై ఆగ్రహంతో సౌదీ అరేబియా బ్యారల్‌ ధరలో 6-8 డాలర్ల చొప్పున డిస్కౌంట్‌ను ప్రకటించింది. అంతేకాకుండా ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించింది. నిజానికి రష్యాసహా ఒపెక్‌ దేశాలు రెండేళ్లుగా ధరలకు నిలకడను తీసుకువచ్చేందుకు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తూ వస్తున్నాయి. దీంతో సోమవారం ఒక్క రోజులోనే చమురు ధరలు ఇంట్రాడేలో 32 శాతంవరకూ కుప్పకూలాయి. చివరికి 24 శాతం నష్టంతో ముగిశాయి. రోజుకి 2.5 మిలియన్‌ బ్యారళ్ల చొప్పున అమలు చేస్తున్న ఉత్పత్తి కోతలను మరో 1.5 మిలియన్‌ బ్యారళ్లమేర పెంచేందుకు సౌదీ అరేబియా గత వారాంతాన ప్రతిపాదించింది. అయితే రష్యా ఇందుకు అంగీకరించకపోవడంతో ఆదివారానికల్లా చమురు ధరలపై డిస్కౌంట్లతోపాటు ఉత్పత్తిని పెంచనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ వివాదాలతో శుక్రవారం 10 శాతం పతనమైన చమురు ధరలు సోమవారానికల్లా మరో 24 శాతం పడిపోయాయి. వెరసి రెండు రోజుల్లోనే 34 శాతం తిరోగమించాయి. అయితే నేటి(మంగళవారం) ట్రేడింగ్‌లో 7 శాతం కోలుకున్నప్పటికీ మూడు రోజుల క్రితం ధరలతో పోలిస్తే 27 శాతం తక్కువలో ట్రేడవుతున్నాయి.

ఎకానమీలకు షాక్‌
నిజానికి చమురు ధరలు బ్యారల్‌ సగటున 80 డాలర్ల చొప్పున విక్రయించగలిగితే.. పలు అరేబియన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలకు తగినన్ని వనరులు లభించగలవన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే గత కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య కొనసాగిన వాణిజ్య వివాదాలు, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగేందుకు నిర్ణయించుకోవడం(బ్రెక్సిట్‌) వంటి సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సమస్యలు సృష్టిస్తూ వచ్చాయి. దీంతో ప్రపంచంలోనే రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా, భారత్‌సహా పలు దేశాలు ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి చైనాలోని వుహాన్‌లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ వేగంగా విస్తరించడం ద్వారా ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతోంది. ఇదే సమయంలో చమురు ఉత్పత్తి తగ్గింపుపై సౌదీ అరేబియా అధ్యక్షతన ఒపెక్‌ దేశాలు, రష్యా మధ్య వివాదం ఏర్పడటంతో సమస్యలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఈ ఏడాది(2020) ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా చమురుకు డిమాండ్‌ క్షీణించనుందన్న అంచనాలు ఆందోళనకు లోను చేస్తున్నాయి. ఇందువల్లనే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఎమర్జెన్సీ ప్రాతిపదికన వడ్డీ రేట్లలో 0.5 శాతం తగ్గింపును ప్రకటించింది.

చమురు దేశాలకు ఇబ్బందే
నిజానికి సౌదీ అరేబియా, రష్యా.. రెండు దేశాలూ ప్రభుత్వ బడ్జెట్‌ల కోసం చమురు ఆదాయాలపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. ఓవైపు బ్యారల్‌కు సగటున 42 డాలర్లు చొప్పున లభించినప్పటికీ బడ్జెట్‌ను బ్యాలన్స్‌ చేసుకోగలమని రష్యా చెబుతోంది. అయితే రష్యాతరహాలో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ విభిన్న ఆదాయాల ఆధారితంకాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో చమురు ధరలు పతనమైతే సౌదీసహా పలు చమురు దేశాలకు ఆర్థికంగా సమస్యలు ఎదురుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) అంచనాల ప్రకారం బ్యారల్‌కు సగటున 80 డాలర్లు లభించవలసి ఉంది. నిజానికి సౌదీ అరేబియాకు ఉత్పాదక వ్యయాలు అతితక్కువే అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ చమురు ఆధారితంకావడం ప్రస్తావించదగ్గ విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విధంగా ఇరాన్‌, ఒమన్‌ తదితర పలు గల్ఫ్‌ దేశాలు చమురు ఆదాయాలపై అధికంగా ఆధారపడుతున్నట్లు వివరించారు.

దేశానికి మేలు
ఇండియాసహా ప్రపంచ దేశాలు అత్యధికంగా వినియోగించే బ్రెంట్‌ చమురు బ్యారల్‌ సోమవారం ఒక దశలో 14 డాలర్లు పడిపోయి 31 డాలర్లకు చేరింది. 1991 జనవరి 17 తదుపరి చమురు ధరలు ఈ స్థాయిలో పతనంకావడం ఇదే తొలిసారికాగా.. నాలుగేళ్ల కనిష్టానికి చేరాయి. కాగా.. చమురు ధరలు బ్యారల్‌కు 10 డాలర్లు చొప్పున వెనకడుగు వేస్తే.. వార్షికంగా కరెంట్‌ ఖాతా లోటు 15 బిలియన్‌ డాలర్లమేర తగ్గుతుందని అంచనా. అంతేకాకుండా వంట గ్యాస్‌, కిరోసిన్‌ తదితరాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బిల్లులో దాదాపు 2 బిలియన్‌ డాలర్లమేర ఆదా అయ్యే వీలుంది. పెట్రో ప్రొడక్టుల ధరలపై ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీని వసూలు చేస్తుంటుంది. ఇది పెంచినప్పటికీ పెట్రోల్‌ ఉత్పత్తులు చౌకగా లభించే అవకాశముంది. ఇవి కాకుండా పెయింట్స్‌, టైర్లు, పాలిమర్స్‌ తదితర పలు రంగాలకు ముడివ్యయాలు భారీగా తగ్గే అవకాశముంది. విమానయానం, నౌకాయానం, మౌలిక సదుపాయాల రంగాలు సైతం చమురు ధరలు తగ్గితే లబ్ది పొందే అవకాశముంది!
 



You may be interested

యస్‌ బ్యాంక్‌ బాండ్ల రద్దు- ఫండ్స్‌కు షాక్‌

Tuesday 10th March 2020

పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ఇలా రూ. 8,700 కోట్ల AT 1 బాండ్ల రద్దు నష్టపోనున్న జాబితాలో.. ఆర్‌ఐఎల్, ఎల్‌అండ్‌టీ బార్‌క్లేస్‌, బజాజ్‌ అలయెంజ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టనున్న పునర్వ్యవస్థీకరణ చర్యలలో భాగంగా ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ యస్‌ బ్యాంక్‌ జారీ చేసిన AT 1 బాండ్లు రద్దుకానున్నట్లు తెలుస్తోంది. దీంతో పలు మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు)తోపాటు.. పెన్షన్‌ ఫండ్స్‌, కార్పొరేట్స్‌ సైతం నష్టపోయే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. యస్‌ బ్యాంక్‌ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా వివరాల ప్రకారం నిప్పన్‌, కొటక్‌,

రూ.44,000పైన పసిడి

Tuesday 10th March 2020

సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ఎనిమిదేళ్ల తర్వాతా మొదటిసారి 1700 డాలర్లు చేరుకున్న పసిడి మంగళవారం స్వల్పంగా తగ్గింది. నిన్న స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమవ్వడం, ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టుబడులవైపు దృష్టిపెడుతుండడంతో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.300 తగ్గి 10 గ్రాముల బంగారం రూ.44,353.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 9 డాలర్లు తగ్గి నేటి ఉదయం ఔన్స్‌ బంగారం 1,666.80

Most from this category