News


ప్రతీ బేర్‌ దశ తదుపరి బుల్‌ ట్రెండ్‌!

Tuesday 17th March 2020
Markets_main1584428451.png-32529

బేర్‌ పట్టులో సగటున 39 శాతం పతనం
ఆపై 40-100 శాతం మధ్య బుల్‌ ర్యాలీ 
గత రెండు దశాబ్దాల చరిత్రలో గణాంకాలివి

కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ పతన బాటలో సాగుతున్నాయి. గత నెల రోజుల్లోనే యూఎస్‌ మార్కెట్లు 27 శాతం పడిపోగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో నిఫ్టీ గత రెండు నెలల్లో 30 శాతంపైగా తిరోగమించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ విలయం సృష్టిస్తోంది. కోవిడ్‌-19 దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి ఏకంగా మాంద్యంలోకి జారుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో అమెరికా నుంచి ఆసియా వరకూ ఈక్విటీలు, బంగారం, చమురు తదితరాలు కుప్పకూలుతున్నాయి. 

కేంద్ర బ్యాంకుల ప్రభావం నిల్‌
ఆర్థిక వ్యవస్థలకు దన్నుగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు.. సహాయక ప్యాకేజీలను అమలు చేస్తున్నాయి. ప్రధానంగా ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లపై అత్యంత ప్రభావం చూపగల అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం 1.5 లక్షల కోట్ల డాలర్లతో స్టిములస్‌కు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా రెండు వారాల సమయంలోనే వడ్డీ రేట్లను జీరో(0-0.25 శాతం) స్థాయికి చేర్చింది. ఇంతక్రితం 2008లో అమెరికాలో పుట్టిన సబ్‌ప్రైమ్‌ సంక్షోభం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. ప్రస్తుతం చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా ప్రపంచ దేశాలను భయంతో వణికిస్తోంది. దీంతో మార్కెట్లు బుల్‌ ట్రెండ్‌ను వీడి బేర్‌ దశలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ఆరుసార్లు..
విభిన్న కారణాలతో గత రెండు దశాబ్దాలలో స్టాక్‌ మార్కెట్లు పలుమార్లు పతనమయ్యాయయి ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. ఆరుసార్లు 25 శాతంపైగా క్షీణించాయని తెలియజేసింది. వీటిలో నాలుగుసార్లు 30 శాతంపైగా క్షీణత నమోదైందని వివరించింది. అయితే తదుపరి మార్కెట్లు స్థిరపడ్డాక ఏడాది లేదా రెండేళ్ల కాలంలో తిరిగి సానుకూల ఫలితాలను ఇచ్చినట్లు వెల్లడించింది.

2000 నుంచీ చూస్తే
రెండు దశాబ్దాల క్రితం నుంచి ట్రెండ్‌ను చూస్తే..  ఫిబ్రవరి 2000- సెప్టెంబర్‌ 2001 మధ్య నిఫ్టీ 53 శాతం పతనమైంది. ఇందుకు 20 నెలల కాలం పట్టింది. తదుపరి స్థిరపడేందుకు 21 నెలల సమయం తీసుకుంది. ఆపై ఏడాది కాలంలో 13 శాతం బలపడగా.. రెండేళ్ల కాలంలో ఏకంగా 67 శాతం జంప్‌చేసింది. ఇక 2004 జనవరి- మే మధ్యకాలంలో 5 నెలలపాటు 36 శాతం దిద్దుబాటును నిఫ్టీ చవిచూసింది. తదుపరి 7 వారాలపాటు స్థిరీకరణలో గడిపింది. ఆపై ఏడాదిలో 62 శాతం, రెండేళ్లలో 138 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో 2006 మే- జూన్‌ మధ్య 31 శాతం తిరోగమించింది. ఆరు వారాల స్థిరీకరణ తరువాత ఏడాదిలో 66 శాతం, రెండేళ్లలో 56 శాతం చొప్పున లాభపడింది. ఇక 2008 జనవరి- అక్టోబర్‌ మధ్య 10 నెలల కాలంలో 65 శాతం వెనకడుగు వేసింది. ఆపై 5 నెలలపాటు సర్దుబాటుకు లోనయ్యాక ఏడాదిలో 109 శాతం, రెండేళ్లలో 167 శాతం చొప్పున రిటర్నులు అందించింది. ఇదే విధంగా 2010 నవంబర్‌- 2011 డిసెంబర్‌ మధ్య 14 నెలల కాలంలో 29 శాతం నష్టాలను చవిచూసింది. రెండు వారాలపాటు కన్సాలిడేట్‌ అయ్యాక ఏడాదిలో 30 శాతం, తదుపరి ఏడాది మరో 39 శాతం చొప్పున ఎగసింది. 2015 మార్చి, 2016 ఫిబ్రవరి మధ్య కూడా 12 నెలల్లో 25 శాతం క్షీణించింది. రెండు వారాల్లోనే స్థిరీకరణ పూర్తిచేసుకుని తొలి ఏడాది 30 శాతం, తదుపరి ఏడాది 54 శాతం చొప్పున పెరిగింది. 

ప్రస్తుత పరిస్థితేంటి?
ప్రస్తుతం అంటే ఈ జనవరి నుంచి మార్చిలో ఇప్పటివరకూ నిఫ్టీ 31 శాతం నష్టపోయింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను సరికొత్త సమస్య పట్టిపీడిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సార్స్‌, జికా, స్వైన్‌ఫ్లూ తదితర వ్యాధులు తలెత్తినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో మార్కెట్లు ఎంతవరకూ పతనంకావచ్చన్నది అంతుచిక్కకుండా ఉన్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పెట్టుబడులు రక్షణాత్మక పెట్టుబడులుగా భావించే బంగారం, జపనీస్‌ కరెన్సీ యెన్‌, యూఎస్‌ ట్రెజరీలలోకి మళ్లుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇందువల్లనే 12ఏళ్ల తదుపరి ప్రపంచ మార్కెట్లు డౌన్‌ సర్క్యూట్లను తాకుతున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్‌ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు డీలాపడే అవకాశమున్నదని, తదుపరి ఎంత స్పీడ్‌గా కోలుకుంటాయన్న అంశంమీదే స్టాక్‌ మార్కెట్లలో రికవరీకి చాన్స్‌ ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి.



You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్‌ 8.50శాతం అప్‌..!

Tuesday 17th March 2020

కరోనా ఎఫెక్ట్‌తో లిస్టింగ్‌లో నిరాశపరిచిన ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు మరుసటి రోజు లాభాల బాటపట్టింది. బీఎస్‌ఈలో మంగళవారం ఈ షేరు రూ.685.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ రికవరిలో భాగంగా మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు కొనుగోలుకు ఇన్వెస్టర్లు మొగ్గచూపారు. ఫలితంగా ఒక దశలో షేరు ఒక 9శాతం లాభపడి రూ.744.50 వద్ద ఇంట్రాడే గరిష్టా‍న్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:20ని.లకు షేరు మునుపటి ముగింపు(రూ.683.20)తో పోలిస్తే 8.50శాతం

ఏడాది కనిష్టానికి 259 షేర్లు

Tuesday 17th March 2020

మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 259 షేర్లు పడిపోయాయి.వీటిలో 21 ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ఆర్వీ డెనిమ్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, ఆగ్రోఫోస్‌ ఇండియా, ఆక్స్ ఆఫ్టీఫైబర్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అన్సల్‌ హౌసింగ్‌, ఆర్కిస్‌, ఆర్కోటెక్‌, అరిహంత్‌ ఫౌండేషన్స్‌ అండ్‌ హౌసింగ్‌, అరవింద్‌ ఫ్యాషన్స్‌, ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌, ఆశియానా హౌసింగ్‌, అట్లాంటా,

Most from this category