News


ఏయూ స్మాల్‌ బ్యాంక్‌.. ర్యాలీ ఎందుకంట?

Saturday 8th February 2020
Markets_main1581153880.png-31628

3 నెలల్లో 70 శాతం ర్యాలీ
రూ. 637 నుం‍చి రూ. 1129కు 
క్యూ3లో పటిష్ట ఫలితాలు
ఇష్యూ ధర రూ. 358

కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఇటీవల మరింత జోరందుకుంది. ఇందుకు కంపెనీ పటిష్ట పనితీరును చూపడం ప్రధానంగా కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కౌంటర్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో నికర లాభం రెట్టింపునకు ఎగసింది. రూ. 190 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం సైతం 46 శాతం పెరిగి రూ. 348 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం మరింత అధికంగా 87 శాతం జంప్‌చేసి రూ. 273 కోట్లయ్యింది. రుణ నాణ్యత మెరుగుపడుతున్న సంకేతాలనిస్తూ త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 2 శాతం నుంచి 1.9 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.1 శాతం నుంచి 1 శాతానికి నీరసించాయి. బ్యాంక్‌ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 37 శాతం పుంజుకుని రూ. 29,867 కోట్లను అధిగమించాయి. వీటిలో రిటైల్‌ విభాగం వాటా 81 శాతంకావడం గమనార్హం!

మరింత మెరుగైన ఫలితాలు
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ బిజినెస్‌లో పటిష్ట వృద్ధిని సాధిస్తున్నట్లు రీసెర్చ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. వృద్ధిని కొనసాగించేందుకు వీలుగా తగినస్థాయిలో పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. మార్జిన్లలో నిలకడ, వ్యయ నియంత్రణ వంటి అంశాలు ఇకపైన కూడా బ్యాంకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఈ కౌంటర్‌లో ఇకపై భారీ రిటర్నులకు అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. కాగా.. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులో ఇటీవల ప్రపంచ బ్యాంకు అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఐఎఫ్‌సీ).. కొంతమేర వాటాను విక్రయించింది.

షేరు జోరిలా
శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేరు 3.3 శాతం లాభపడి రూ. 1130 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1148 సమీపానికి చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. బ్యాంక్‌ ఐపీవో ధర రూ. 358తో పోలిస్తే ఈ షేరు దాదాపు మూడు రెట్లు దూసుకెళ్లడం విశేషం! గత మూడు నెలల్లో 70 శాతం ర్యాలీ చేసింది. నవంబర్‌ 6న ఈ షేరు రూ. 664 వద్ద ముగిసింది. ఇక నెల రోజుల్లోనే 43 శాతం ఎగసింది. జనవరి 6న  ఈషేరు రూ. 791 వద్ద ట్రేడయ్యింది. ఇందుకు కంపెనీ పనితీరు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు గతేడాది ఈపీఎస్‌ రూ. 11.5 నుంచి రూ. 19.7కు జంప్‌చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇది 71 శాతం వృద్ధికాగా..  ఆదాయాన్ని పెంచుకుంటూనే మార్జిన్లను నిలుపుకుంటూ రావడంతో లాభదాయకత మెరుగుపడినట్లు తెలియజేశారు. ఇందుకు తగిన స్థాయిలో పెట్టుబడులను వెచ్చించడం సహకరించినట్లు వివరించారు. కాగా.. వాహన ఫైనాన్సింగ్‌ బిజినెస్‌లోకి ప్రవేశిస్తుండటం, షేరు ధర భారీగా పెరగడం వంటి అంశాల కారణంగా ఈ కౌంటర్‌లో పెట్టుబడులు లాభదాయకంకాదంటూ ఐఐఎఫ్‌ఎల్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఫండమెంటల్స్‌ ఇలా
కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) దాదాపు రూ. 33,000 కోట్లకు చేరింది. బుక్‌వేల్యూ రూ. 100ను అధిగమించగా.. నికర లాభ మార్జిన్లు 13 శాతంస్థాయిలో నమోదయ్యాయి. ఆర్‌వోసీఈ 11.87 శాతంగా నమోదైంది. రుణ, ఈక్విటీ(డీఈ) నిష్పత్తి 2.92గా ఉంది. బ్యాంకులో ప్రమోటర్లకు 36 శాతం వాటా ఉంది. కంపెనీ 2017 జూన్‌లో పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకుంది. ఇష్యూ ధర రూ. 358కాగా.. 47 శాతం లాభంతో రూ. 525 వద్ద లిస్టయ్యింది.You may be interested

మరింత తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

Saturday 8th February 2020

శనివారం ఇంధన ధరలు భారీగా తగ్గాయి.  కరోనా వైరస్‌ ప్రభావంతో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ డిమాండ్‌ తగ్గడంతో  క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఒక శాతంపైగా తగ్గాయి.  దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.72.45గా ఉంటే, ముంబైలో రూ.78.11, కోలకతాలో రూ.75.13, చెన్నైలో రూ.75.27 గా  ధరలు ఉన్నాయి. అదేవిధంగా ఢిల్లీలో లీటర్‌ డీజీల్‌ ధర 65.43గా ఉంటే ముంబై లోరూ.68.57, కోల్‌కతాలో రూ.67.79, చెన్నైలో రూ.69.10గా

మహిళా సీఈఓల వేతనాలు తక్కువ!

Saturday 8th February 2020

   మహిళలు కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగినప్పటికీ స్త్రీ పురుషుల వేతనాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. పురుష సీఈఓల సగటు జీతాల కంటే మహిళా సీఈఓల సగటు జీతాలు 45 శాతం తక్కువగా ఉన్నాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. గత ఆర్థికసంవత్సరం 2018లో  22.5 శాతంగా ఉన్న పే గ్యాప్‌ రెట్టింపు అయ్యి 45 శాతానికి చేరిందని ప్రైమ్‌ డేటాబేస్‌ నంబర్స్‌ నివేదిక వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అయిన  1,747

Most from this category