News


దీర్ఘకాలానికి 15 స్టాక్‌ రికమండేషన్స్‌

Wednesday 5th February 2020
Markets_main1580894948.png-31532

జాబితాలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు
కన్జూమర్‌ ఫైనాన్స్‌, ఫుట్‌వేర్‌, హెల్త్‌కేర్‌

ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచే అంచనాలను బడ్జెట్‌ మిస్‌ అయినప్పటికీ షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రస్తుత సమయాన్ని వినియోగించుకోవచ్చునని పలువురు మా‍ర్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. పలువురు ఆర్థికవేత్తల ఆశలను బడ్జెట్‌ అందుకోనప్పటికీ మార్కెట్ల ట్రెండ్‌ను దెబ్బతీయలేదని అభిప్రాయపడ్డారు. వెరసి మార్కెట్లు ఇకపైనా మరింత లాభపడే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక ధృక్పథంతో షేర్ల కొనుగోలును చేపట్టవచ్చని సూచిస్తున్నారు. అయితే ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకోవలసి ఉంటుందని తెలియజేస్తున్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అత్యంత సానుకూల అంశంకాగా.. బడ్జెట్‌లో ఆదాయ పన్ను తగ్గింపు విధానాలు ప్రకటించకపోవడం పొరపాటు నిర్ణయమని ప్రభుదాస్‌ లీలాధర్‌ వ్యాఖ్యానించింది. దీంతో వినియోగ డిమాండ్‌ను సృష్టించే అవకాశాలు కోల్పోయినట్లు అభిప్రాయపడింది. కాగా.. బడ్జెట్‌ నేపథ్యంలో భారీగా పతనమైన మార్కెట్లు తిరిగి బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ.. 200 రోజుల చలన సగటు(డీఎంఏ)ను ఛేదించింది. దీంతో సమీప కాలంలో మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు బ్రోకింగ్‌ సంస్థలు ఇచ్చిన స్టాక్‌ రికమండేషన్స్‌.. తదితర వివరాలు చూద్దాం..

లక్ష్మణ రేఖ..
బడ్జెట్‌ ఈవెంట్‌ ముగిసిందని..  ఇన్వెస్టర్లు కంపెనీల ఫలితాలపై దృష్టి సారిస్తారని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇకపై నిఫ్టీ 11,000 పాయింట్లకు దిగితే.. కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించవచ్చని చెబుతున్నారు. ఏడాది కాలంలో నిఫ్టీ 13,000 పాయింట్లను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. నిఫ్టీకి 200 డీఎంఏను లక్ష్మణ రేఖగా చెప్పవచ్చంటున్నారు. పలు సందర్భాలలో నిఫ్టీ ఈ స్థాయిల నుంచి తిరిగి పుంజుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం నిఫ్టీ 18 ఫార్వార్డ్‌ పీఈలో ట్రేడవుతున్నదని, దీంతో ఇకపై భారీ రిటర్నులకు అవకాశం తక్కువేనని అభిప్రాయపడ్డారు.

- గౌరవ్‌ గార్గ్‌, రీసెర్చ్‌ హెడ్‌, కేపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌
అపోలో హాస్పిటల్స్‌, అజంతా ఫార్మాస్యూటికల్స్‌: ఆరోగ్య పరిరక్షణ, సామాజిక భద్రతలకు బడ్జెట్‌ చెప్పుకోదగ్గ కేటాయింపులు చేసింది. దీంతో అపోలో హాస్పిటల్స్‌, అజంతా ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీలను డార్క్‌ హార్స్‌ షేర్లుగా పేర్కొనవచ్చు. 
స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌: 2020కల్లా డిజిటల్‌ కనెక్టివిటీలో భాగంగా 1000 గ్రామ పంచాయతీలను అనుసంధానించనున్నారు. దీంతో అప్టికల్‌ ఫైబర్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సొల్యూషన్ల కంపెనీ స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయవచ్చు.
బాటా ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్‌: చౌక దిగుమతులకు చెక్‌ పెడుతూ బడ్జెట్‌లో ఫుట్‌వేర్‌పై కస్టమ్స్‌ డ్యూటీని పెంచారు. దీంతో దీర్ఘకాలంలో ఫుట్‌వేర్‌ రంగ కంపెనీలకు లబ్ది చేకూరనుంది. ఈ విభాగంలో బాటా ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్‌ షేర్లను ఎంపిక చేసుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ: రైల్వేలకు ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్య(పీపీపీ) అవకాశాలను పెంచడం ద్వారా బడ్జెట్‌ బూస్ట్‌నివ్వనుంది. స్టేషన్ల అభివృద్ధి, తేజస్‌ రైళ్లు తదితరాలకు పెట్టుబడులు లభించనున్నాయి. ఇది ఐఆర్‌సీటీసీ వంటి కౌంటర్లకు లాభదాయకంకానుంది.

- దినేష్‌ థక్కర్‌, సీఎండీ, ట్రేడ్‌బుల్స్‌ సెక్యూరిటీస్‌
ఎఫ్‌ఎంసీజీ, ఐటీ: బడ్జెట్‌ ప్రతిపాదనల నేపథ్యంలో ఐటీ, ఎంఎన్‌సీ, నాన్‌బ్యాంకింగ్‌ పీఎస్‌యూ స్టాక్స్‌ లాభపడే వీలుంది. ప్రధానంగా కంపెనీలకు సంబంధించి డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) రద్దు కారణంగా అధిక డివిడెండ్లు ప్రకటించే ఐటీ, ఎఫ్‌ఎంసీజీ తదితర కంపెనీలు జోరు చూపవచ్చు. దీనికితోడు.. ఆదాయ పన్ను ప్రతిపాదనలతో నిత్యావసరాల వినియోగం​పెరిగే వీలుంది. దీంతో హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌తోపాటు.. టీసీఎస్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ పుంజుకునే అవకాశముంది.

- పరస్‌ బోత్రా, ఈక్విటీ రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌, ఆషికా స్టాక్‌ బ్రోకింగ్‌
బజాజ్‌ ఫైనాన్స్‌: కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫర్నీచర్‌, డిజిటల్‌ ప్రొడక్టులు, లైఫ్‌స్టైల్‌ తదితర పలు రంగాల వినియోగదారులకు రుణాలందించే బజాజ్‌ ఫైనాన్స్‌కు బడ్జెట్‌ ప్రతిపాదనలతో మేలు జరగనుంది. కంపెనీ ఆదాయంలో కన్జూమర్‌ ఫైనాన్స్‌ విభాగం 39 శాతం వాటాను ఆక్రమిస్తోంది. వీటికితోడు ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాలలోనూ రుణాలందిస్తోంది. ఇందుకు మాతృ సంస్థ బజాజ్‌ ఆటో తోడ్పాటు లభిస్తోంది. దీంతో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు జోరు చూపవచ్చు. 

- కుల్‌దీప్‌ తోమర్‌, డైరెక్టర్‌, అడ్వయిజరీమండీ.కామ్‌   
అవంతీ ఫీడ్స్‌: చేపల ఉత్పత్తికి బడ్జెట్‌ అత్యధిక చేయూతను ప్రకటించింది. వచ్చే ఏడాదిలో చేపల ఉత్పత్తిని 2 కోట్ల టన్నులకు చేర్చాలని బడ్జెట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో చేపలు, రొయ్యలకు మేత అందించే అవంతీ ఫీడ్స్‌ అమ్మకాలు పెరిగే అవకాశముంది. ఆక్వాకల్చర్‌ రంగంలో నాణ్యమైన ప్రొడక్టుల ద్వారా కంపెనీ అగ్రస్థానంలో నిలుస్తోంది.
డిక్సన్‌ టెక్నాలజీస్‌: మొబైల్‌ ఫోన్లలో వినియోగించే ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల(పీసీబీలు)పై బడ్జెట్‌లో దిగుమతి సుంకాలను పెంచారు. దీంతో చౌక ఉత్పత్తులకు చెక్‌ పడనుంది. ఇది పీసీబీల తయారీ దిగ్గజమైన డిక్సన్‌ టెక్నాలజీస్‌కు ప్రయోజనం చేకూర్చనుంది.
టీసీఎస్‌: అత్యధిక స్థాయిలో డివిడెండ్లను ప్రకటించే ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌.. బడ్జెట్‌లో డీడీటీ రద్దుతో మరిన్ని మిగులు నిధులను వాటాదారులకు పంచే వీలుంది.
సీమెన్స్‌ ఇండియా: రానున్న మూడేళ్లలోగా సంప్రదాయ ఎలక్ట్రిక్‌ మీటర్లస్థానే.. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను ప్రవేశపెట్టేందుకు తాజా బడ్జెట్‌ ప్రణాళికలు వేసింది. దీంతో ఇది సీమెన్స్‌ ఇండియా కంపెనీకి అవకాశాలను పెంచనుంది.
మహీంద్రా లాజిస్టిక్స్‌: సరికొత్త జాతీయ లాజిస్టిక్స్‌ విధానాలను ప్రకటించనున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు.. నియంత్రణ సంస్థల పాత్రలను స్పష్టం చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా లాజిస్టిక్స్‌ రంగానికి ప్రోత్సాహం లభించనుంది. ఇది మహీంద్రా లాజిస్టిక్స్‌కు మేలు చేయగలదు.

 

 You may be interested

కొత్త సంస్కరణల్లేవు.. అయినా రేటింగ్‌ యథాతధం..

Wednesday 5th February 2020

బడ్జెట్‌పై ఫిచ్‌ రేటింగ్స్‌ నూతన నిర్మాణాత్మక సంస్కరణలు తాజా బడ్జెట్లో పెద్దగా లేవని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. అయితే ఈ కారణంతో భారత వృద్ధి అంచనాలను మార్చడం లేదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 5.6 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. 2024-25 నాటికి జీడీపీలో ప్రభుత్వ వ్యయం వాటా 60 శాతానికి పరిమితం చేయాలన్న ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట లక్ష్యం నెరవేరకపోవచ్చని అభిప్రాయపడింది. 2021-11 నాటికి

టాటామోటర్స్‌ షేరు 10శాతం జంప్‌..!

Wednesday 5th February 2020

ఉత్సాహానిచ్చిన బ్రిటన్‌ జేఎల్‌ఆర్‌ విక్రయ గణాంకాలు టాటా మోటర్స్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌లో 10శాతం లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.167.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రానున్న రెండేళ్లలో కనీసం 4రకాల మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటనతో పాటు వార్షిక ప్రాతిపదికన బ్రిటన్‌లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు జవవరిలో 3శాతం వృద్ధిని సాధించడం,  జనవరి మాసపు విక్రయగణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో

Most from this category