News


టాటా మోటార్స్‌ నష్టాలు రూ.3,679 కోట్లు

Friday 26th July 2019
Markets_main1564134097.png-27337

  • 8 శాతం తగ్గి రూ.61,467 కోట్లకు ఆదాయం 
  • నాలుగు రెట్లు పెరిగిన వడ్దీ వ్యయాలు 
  • మళ్లీ లాభాల్లోకి వస్తాం 
  • 4.5 శాతం నష్టపోయిన టాటా మోటార్స్‌ షేర్‌ 

న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.1,863 కోట్లుగా ఉన్న నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై రూ.3,680 కోట్లకు పెరిగాయి. చైనాతో పాటు భారత్‌లో కూడా అమ్మకాలు తగ్గడం, మార్కెటింగ్‌ వ్యయాలు అధికంగా ఉండటం, అమ్మకాలు పెంచుకోవడానికి పెద్ద మొత్తాల్లో డిస్కౌంట్లు ఆఫర్‌ చేయడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ పి.బి. బాలాజీ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.66,701 కోట్ల నుంచి 8 శాతం తగ్గి రూ.61,467 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.  స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ1లో రూ.1,188 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ1లో రూ.97 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.336 కోట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగి రూ.1,712 కోట్లకు చేరాయని తెలిపారు. 

23 శాతం తగ్గిన అమ్మకాలు...
 లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) నికర నష్టాలు గత క్యూ1లో 26 కోట్ల పౌండ్ల నుంచి ఈ క్యూ1లో 39.5 కోట్ల పౌండ్లకు పెరిగాయని టాటా మోటార్స్‌ కంపెనీ తెలిపింది. ఈ క్యూ1లో జేఎల్‌ఆర్‌ విక్రయాలు 12 శాతం తగ్గి 1.28 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఈ క్యూ1లో మొత్తం వాహన విక్రయాలు 23 శాతం క్షీణించి 1.36 లక్షలకు తగ్గాయని తెలిపింది. 

మందగమనం...
వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, లిక్విడిటీ సమస్య, యాగ్జిల్‌ లోడ్‌కు సంబంధించిన నిబంధనలు.. వీటన్నింటి కారణంగా డిమాండ్‌ తగ్గి వాహన పరిశ్రమలో మందగమనం చోటు చేసుకుందని టాటా మోటార్స్‌ సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బుశ్చెక్‌  చెప్పారు. 

లాభాల గైడెన్స్‌ కొనసాగింపు...
ప్రపంచ వ్యాప్తంగా వాహన పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తమ ఆర్థిక ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయని టాటా మోటార్స్‌ సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బుశ్చెక్‌  చెప్పారు.  పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఈ ఆర్థిక సంవత్సరంలో 250 కోట్ల పౌండ్ల లాభం ఆర్జించగలమన్న గైడెన్స్‌ను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. చైనాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయని, కొత్త మోడళ్ల కారణంగా జేఎల్‌ఆర్‌ వృద్ధి పుంజుకోగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇక దేశీయంగా  కూడా పరిస్థితులు మెరుగుపడగలవని పేర్కొన్నారు. రిటైల్‌ అమ్మకాల వృద్ధిపై దృష్టిపెట్టామని, డీలర్ల లాభదాయకత మెరుగుపడగలదని, డిమాండ్‌ పుంజుకునే కొత్త ఉత్పత్తులను అందించనున్నామని, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్థతులు పాటించనున్నామని వివరించారు. భారీ మార్పు దశలో టాటా మోటార్స్‌ ఉందని జేఎల్‌ఆర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాల్ఫ్‌ స్పెత్‌ వ్యాఖ్యానించారు. కఠినమైన మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటున్నామని, నిర్వహణ సామర్థ్యం పెంచుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సంరలోనే మళ్లీ లాభాల బాట పడుతామని ధీమా వ్యక్తం చేశారు.



You may be interested

గార్గ్‌ ఆకస్మిక బదిలీ... వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు

Friday 26th July 2019

న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ కార్యదర్శి పదవిలో ఉన్న సుభాష్‌చంద్రగార్గ్‌(58)ను కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి విద్యుత్‌ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) కార్యదర్శిగా ఉన్న అతను చక్రవర్తిని నియమించింది. బుధవారం రాత్రి ఈ ఆదేశాలు జారీ చేయడంతో గురువారం గార్గ్‌ అనూహ్య నిర్ణయం ప్రకటించారు. స్వచ్చంద పదవీ విరమణకు (వీఆర్‌ఎస్‌)కు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఈ ఏడాది అక్టోబర్‌ 31 ఉద్యోగిగా

మార్కెట్లోకి ‘బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ ఎక్స్‌7’

Friday 26th July 2019

 ప్రారంభ ధర రూ.98.9 లక్షలు  6.1 సెకన్లలో సున్నా నుంచి 100కి.మీ వేగం గురుగ్రామ్‌: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన ఫ్లాగ్‌షిప్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ) ‘ఎక్స్‌7’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.98.9 లక్షలు (ఎక్స్‌-షోరూం). పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో ఈ నూతన ఎస్‌యూవీ లభిస్తుండగా.. పెట్రోల్‌ వేరియంట్‌ కేవలం 6.1 సెకన్ల సమయంలోనే సున్నా నుంచి

Most from this category