News


ఇక రిలయన్స్‌, బీపీ పెట్రోల్ బంకులు

Wednesday 7th August 2019
Markets_main1565154211.png-27590

  • అయిదేళ్లలో దేశవ్యాప్తంగా 5,500కు బంకుల సంఖ్య
  • విమాన ఇంధన విక్రయ కార్యకలాపాలు కూడా
  • రెండు సంస్థల జాయింట్ వెంచర్ 
  • 2020 ప్రథమార్ధంలో ఒప్పందం పూర్తి 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు, విమాన ఇంధనాన్ని కూడా విక్రయిచేందుకు దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బ్రిటన్‌కు చెందిన బీపీ తాజాగా జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. పెట్టుబడులు తదితర అంశాలతో కూడిన ఒప్పందం కూడా త్వరలోనే ఖరారు కాగలదని పేర్కొన్నాయి. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2020 ప్రథమార్ధం నాటికి పూర్తి ఒప్పందం కుదరవచ్చని వివరించాయి. డీల్‌ ప్రకారం కొత్త వెంచర్‌లో బీపీకి 49 శాతం, రిలయన్స్‌కు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం రిలయన్స్‌కి చెందిన సుమారు 1,400 పైచిలుకు పెట్రోల్‌ బంకులు, 31 పైచిలుకు విమాన ఇంధన స్టేషన్లు కొత్తగా ఏర్పాటయ్యే జేవీకి బదలాయిస్తారు. రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డడ్లీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. "ఇంధన రిటైలింగ్ రంగంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటైన బీపీతో మా పటిష్టమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం. ఇప్పటికే గ్యాస్ వనరుల అభివృద్ధిలో ఉన్న మా భాగస్వామ్యం ఇక ఇంధన రిటైలింగ్, ఏవియేషన్ ఇంధనాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ స్థాయి సేవలు అందించేందుకు ఇది తోడ్పడనుంది" అని ముకేశ్ అంబానీ తెలిపారు. "రిలయన్స్‌తో కలిసి వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సేవలు, అత్యంత నాణ్యమైన ఇంధనాలు అందిస్తాం" అని బాబ్ డడ్లీ పేర్కొన్నారు.
    వచ్చే అయిదేళ్లలో ఇంధనాల రిటైల్ నెట్‌వర్క్‌ను 5,500 పెట్రోల్‌ బంకులకు విస్తరించనున్నామని రెండు సంస్థలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. "భారత్‌లో విమాన ఇంధన విక్రయ వ్యాపారానికి, రిటైల్ సర్వీస్ స్టేషన్ నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం మా రెండు సంస్థలు కొత్తగా జాయింట్ వెంచర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రిలయన్స్‌కు ఉన్న ఇంధన రిటైలింగ్‌ నెట్‌వర్క్‌, విమాన ఇంధన వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నాం" అని వివరించాయి. అయితే, 1,400 పైచిలుకు పెట్రోల్‌ బంకులు, 31 విమానాశ్రయాల్లో ఉన్న విమాన ఇంధన స్టేషన్లలో కూడా వాటాలు దక్కించుకుంటున్నందుకు గాను రిలయన్స్‌కు బీపీ ఎంత మొత్తం చెల్లించనున్నదీ మాత్రం వెల్లడించలేదు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న జంట చమురు రిఫైనరీల్లో వాటాలు విక్రయించేందుకు సౌదీ ఆరామ్‌కోతో రిలయన్స్ చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ జాయింట్ వెంచర్ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరామ్‌కో కూడా భారత్‌లో ఇంధనాల రిటైలింగ్‌ కార్యకలాపాల వెంచర్‌పై దృష్టి పెట్టింది. 

మూడో జేవీ...
2011 నుంచి రిలయన్స్, బీపీకి ఇది మూడో జాయింట్ వెంచర్‌ కానుంది. 2011లో రిలయన్స్‌కి చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో బీపీ 30 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 7.2 బిలియన్ డాలర్లు. ఇప్పటిదాకా రెండు సంస్థలు చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి కోసం 2 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇక అప్పట్లోనే గ్యాస్‌ సోర్సింగ్‌, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం ఇండియా గ్యాస్ సొల్యూషన్స్‌ (ఐజీఎస్‌పీఎల్‌) పేరిట రెండు సంస్థలు ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఇందులో రెండింటికీ చెరి 50 శాతం వాటాలు ున్నాయి. ఈ మధ్య కాలంలో చమురు, గ్యాస్ బ్లాకుల్లో కొన్నింటిని రిలయన్స్-బీపీ వదిలేసుకున్నాయి. ఇక ఐజీఎస్‌పీఎల్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. 

ఇంధన రిటైలింగ్‌లో పీఎస్‌యూల హవా...
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 65,000 పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) చమురు మార్కెటింగ్ కంపెనీలకే ఉంది. వీటికి ఏకంగా 58.174 బంకులు ఉన్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించి రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ సారథ్యంలోని నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్ ఆయిల్‌)కు 5,244 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వచ్చే 2-3 ఏళ్లలో వీటిని 7,000కు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. రాయల్ డచ్‌ షెల్‌కు ప్రస్తుతం 151అవుట్‌లెట్స్ ఉండగా, కొత్తగా మరో 150-200 దాకా బంకులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారత్‌లో 3,500 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు బీపీకి 2016లోనే లైసెన్సు పొందింది.You may be interested

వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్‌ఎన్‌ఎల్ దృష్టి

Wednesday 7th August 2019

అవుట్‌సోర్సింగ్‌ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై కసరత్తు ఏటా రూ. 200 కోట్ల దాకా ఆదాకు అవకాశం న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యయ నియంత్రణ చర్యలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో బాగంగా అవుట్‌సోర్సింగ్‌కి ఇచ్చిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా ఏటా రూ. 200 కోట్ల దాకా మిగుల్చుకోవచ్చని అంచనా వేస్తోంది. అలాగే టెలిఫోన్‌ ఎక్స్చేంజీల్లో విద్యుత్ బిల్లుల భారాన్ని కూడా తగ్గించుకోవడం ద్వారా

పసిడి @ 1500డాలర్లు

Wednesday 7th August 2019

ఆరేళ్ల సుధీర్ఘకాలం అనంతరం ప్రపంచమార్కెట్లోని పసడి ధరలు 1500డాలర్ల స్థాయిని అందుకుంది. ఆసియాలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 18డాలర్లు ర్యాలీ చేసి 1,502.25డాలర్ల స్థాయిని అందుకుంది. అమెరికా చైనాల మధ్య రోజురోజూకు తీవ్రతరమవుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, అంతర్జాయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, పలు ప్రపంచదేశాల రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లపై మెతక వైఖరి తదితర అంశాలు పసిడి ధర 1500డాలర్ల అందుకునేందుకు తోడ్పాటునిచ్చాయి.

Most from this category