News


సౌదీ ఆరామ్‌ ‘‘కింగ్‌’’

Thursday 12th December 2019
Markets_main1576121625.png-30182

  • లిస్టింగ్‌లోనే అదరగొట్టిన సౌదీ ఆరామ్‌కో
  • 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్‌కు షేర్‌ ధర 
  • 1.88 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిన సంస్థ విలువ 
  • ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్‌ విలువున్న కంపెనీగా ఘనత


దుబాయ్‌: సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కో స్టాక్‌ మార్కెట్‌ అరంగేట్రం అదిరిపోయింది. ఇష్యూ ధర 32 రియాల్స్‌తో పోలిస్తే 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌తో 35.3 రియాల్స్‌ ధరను (9.39 డాలర్లు -రూ.662) తాకింది. ఈ ధర వద్ద కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లు. మన రూపాయల్లో 132.5 లక్షల కోట్లు. గురువారం కూడా ఈ షేర్‌ మరో 10 శాతం పెరిగితే సౌదీ అరేబియా పాలకులు ఆశించిన 2 లక్షల కోట్ల డాలర్ల విలువ గల కంపెనీ అనే మైలురాయిని సాదీ ఆరామ్‌కో చేరనున్నదని అంచనా. సౌదీ ఆరామ్‌కో కంపెనీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఇతర ఐదు చమురు కంపెనీల (ఎక్సాన్‌ మొబిల్‌, టోటల్‌, రాయల్‌ డచ్‌ షెల్‌, షెవ్రాన్‌, బీపీ) మొత్తం మార్కెట్‌ విలువ కన్నా కూడా సౌదీ ఆరామ్‌కో కంపెనీ విలువే ఎక్కువ కావడం విశేషం. వచ్చే ఐదేళ్ల పాటు ఏడాదికి 7,500 కోట్ల డాలర్ల చొప్పున డివిడెండ్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ యోచిస్తోంది.


ఐపీఓ, మార్కెట్‌ విలువలోనూ అగ్రస్థానం...
ఇటీవలే ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా 1.5 శాతం వాటా షేర్లను విక్రయించి 2,560 కోట్ల డాలర్లు (రూ.1,80,480 కోట్లు) సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ ఐపీఓ అవతరించింది. ఇప్పటివరకూ 2,500 కోట్ల డాలర్లతో అలీబాబా పేరిట ఉన్న అతి పెద్ద ప్రపంచ ఐపీఓ రికార్డ్‌ను సౌదీ ఆరామ్‌కో బ్రేక్‌ చేసింది. ఇక బంపర్‌ లిస్టింగ్‌తో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా కూడా ప్రపంచ నెంబర్‌-1 కంపెనీగా సౌదీ ఆరామ్‌కో అవతరించింది. అంతే కాకుండా లిస్టెడ్‌ కంపెనీల పరంగా ప్రపంచంలోనే టాప్‌ 10 స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో ఒకటిగా (తొమ్మిదవ స్థానాన్ని) సౌదీ అరేబియా స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిలిచేందుకు ఈ కంపెనీ తోడ్పడింది. ఇప్పటిదాకా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను సాధించిన కంపెనీలు ప్రపంచంలో రెండే ఉన్నాయి. 1.19 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువతో యాపిల్‌, 1.15 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల తర్వాతి స్థానాల్లో గూగుల్‌ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్‌ (92,600 కోట్ల డాలర్లు), ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ (86,200 కోట్ల డాలర్లు), సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ (57,200 కోట్ల డాలర్లు) నిలిచాయి. ఇక మన దేశంలో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా రూ.9,90,564 కోట్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాంటి 13 కంపెనీలు కలిసినా... ఒక సౌదీ ఆరామ్‌కో కన్నా తక్కువే.

1938లో ఒక చమురు బావితో సౌదీ ఆరామ్‌కో ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి అప్రతిహతంగా ఈ కంపెనీ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన, అతి పెద్దదైన చమురు కంపెనీగా మారింది. ప్రపంచం మొత్తం ముడి చమురు సరఫరాల్లో పది శాతం ముడి చమురును ఈ సంస్థే సరఫరా చేస్తోంది. లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2018లో కంపెనీ నికర లాభం 46 శాతం ఎగసి 11,110 కోట్ల డాలర్లకు పెరిగింది. 35,600 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 



You may be interested

దేశీ మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ ‍టీవీలు

Thursday 12th December 2019

 ఒనిడాతో ఒప్పందం ధర రూ. 12,999-రూ. 21,999 న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా తమ ఫైర్‌ టీవీ బ్రాండ్ స్మార్ట్ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఒనిడా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 32 అంగుళాల ఒనిడా ఫైర్‌ టీవీ స్మార్ట్ టీవీ ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల టీవీ ధర రూ.21,999. డిసెంబర్ 20 నుంచి అమెజాన్‌డాట్‌ఇన్ పోర్టల్‌లో వీటి విక్రయం ప్రారంభమవుతుంది. ఈ ఫుల్ హెచ్‌డీ టీవీల్లో బిల్టిన్‌

2019లో భారత్‌ వృద్ధి 5.1 శాతమే!

Thursday 12th December 2019

ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అంచనా 2020లో 6.5 శాతం ఉంటుందని విశ్లేషణ  న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) తన తాజా నివేదికలో పేర్కొంది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి పలు అంశాలు దీనికి కారణమని ఏడీబీ విశ్లేషించింది. అయితే 2020లో భారత్‌ వృద్ధి

Most from this category